యాసంగి ధాన్యం సేకరణ టార్గెట్ పెంచండి...కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి బీజేపీ నేతల విజ్ఞప్తి

యాసంగి ధాన్యం సేకరణ టార్గెట్ పెంచండి...కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి బీజేపీ నేతల విజ్ఞప్తి
  •     2025-26 యాసంగిలో కొన్నది 35లక్షల టన్నులే..  ఇది పండిన పంటలో మూడోవంతే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: 2025–26 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి తెలంగాణకు కేటాయించిన ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రాన్ని కోరారు. ఈ యాసంగిలో రాష్ట్రం నుంచి 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతిచ్చిందని, ఇది మూడోవంతు మాత్రమేనని వెల్లడించారు.  బుధవారం ఢిల్లీలో ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతిపత్రం అందజేశారు. 

వండ్ల సేకరణ పెంచాలని రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కిసాన్ మోర్చా పంపిన లేఖలను కూడా దీనికి జత చేశారు. అనంతరం ఢిల్లీలో తన అధికారిక నివాసంలో కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2025–26లో వానకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి.. మొత్తంగా 53 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇచ్చామన్నారు. 2025–26 వానాకాలానికి సంబంధించి 45 శాతం బియ్యం ఇప్పటికీ.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ)కు ఇవ్వలేదన్నారు. 2025-–26 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 90 శాతం బియ్యం పరిస్థితి ఇలాగే ఉందన్నారు.  2024–25 వానాకాలంలో 36 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 13 శాతం కూడా పూర్తి చేయలేదన్నారు.  రబీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనూ ఇదే పరిస్థితి అని మండిపడ్డారు.

వడ్లు కోనేందుకు రాష్ట్రానికి రుణం అందజేస్తున్నం

ధాన్యం సేకరణ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు గాలి మాటలు మానుకోవాలని కిషన్​రెడ్డి విమర్శించారు. 12 ఏండ్లలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎన్ సీడీసీ ద్వారా రాష్ట్రానికి రూ.1.16 లక్షల కోట్లు రుణాలను అందజేసిందన్నారు. 2025–26లో ధాన్యం సేకరణ కోసం ఎన్ సీడీసీ ద్వారా రూ.37 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.22,700 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

యూపీఏకు.. ఎన్డీఏకు ఎంతో తేడా: ఎంపీ రఘునందన్ రావు

ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర అంశాల్లో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల పనితీరును పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని రఘునందర్ రావు అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కంటే తమ సర్కార్ ఆరు రెట్లు ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేసిందని చెప్పారు. 2013–14లో నాటి యూపీఎ సర్కార్ 24.32  ఎల్ఎంటీల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే... తమ ప్రభుత్వం 146.33 ఎల్ఎంటీలు సేకరించిందని గుర్తు చేశారు.  

విజ్ఞప్తిని పరిశీలిస్తున్నం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

తెలంగాణలో పెరుగుతోన్న ధాన్యం ఉత్పత్తిని పరిగణలోకి తీసుకొని.. కేంద్రం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం కోరినట్లు ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని.. ప్రస్తుత మార్గదర్శకాలకు అనుగుణంగా సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.