TMC లో చేరిన బీజేపీ వైస్ ప్రెసిడెంట్

TMC లో చేరిన బీజేపీ వైస్ ప్రెసిడెంట్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీకి.. ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ పార్టీని వీడి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం ముకుల్ రాయ్ తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC)లో చేరారు. ముకుల్‌తో పాటు ఆయన కుమారుడు సుబ్రాన్షు కూడా TMC తీర్థం పుచ్చుకున్నారు. 

బెంగాల్‌  అసెంబ్లీ ఎన్నికలకు ముందు TMC  చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. అందులో మొట్ట మొదటి వ్యక్తి ముకుల్‌ రాయ్‌. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ముకుల్‌.. పార్టీ ప్రారంభం నుంచి కీలకంగా పనిచేశారు. అయితే 2017లో మమతాతో రాజకీయపరమైన విబేధాలు రావడంతో పార్టీని వీడారు. ఈ క్రమంలోనే పార్టీ అనుమతి లేకుండా బీజేపీ ముఖ్యనాయకులను కలిసి తృణమూల్‌ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ముకుల్.. ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీ తరపున ముకుల్ విస్తృతంగా పనిచేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగినట్లు..ముకుల్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తిరిగి TMCకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.