జీహెచ్ఎంసీలో త్వరలో  బీజేపీ పాదయాత్రలు!

జీహెచ్ఎంసీలో త్వరలో  బీజేపీ పాదయాత్రలు!

రాబోయే ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా ముందుకు

రాష్ట్ర సర్కార్ ఫెయిల్యూర్స్ను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ  ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే సంస్థాగతంగా ఆరు జిల్లాలను విభజించిన ఆ పా ర్టీ.. వాటికి అధ్యక్షులను కూడా నియమించింది. ఆ అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. త్వరలో బూత్  లెవల్లో  పాదయాత్రలు చేపట్టేందుకు నేతలు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్యూర్స్పై డివిజన్ల వారీగా ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలకు ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు గ్రేటర్ హైదరాబాద్లోని డివిజన్ ఇన్చార్జులుగా బాధ్యతలను అప్పగించే పనిలో బీజేపీ నిమగ్నమైంది.

టీఆర్ఎస్ కార్పొరేటర్లపై చార్జిషీట్

ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ రెండు సర్వేలను నిర్వహించినట్లు సమాచారం. ఆ సర్వేల్లో పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని తేలడంతో రాష్ట్ర నాయకత్వం ఎన్నికల స్పీడ్ ను మరింత పెంచింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ను కలుపుకొని పార్టీ క్యాండిడేట్ల ఎంపికపై బండి సంజయ్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందులో సంజయ్ కే పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 146 డివిజన్లు టీఆర్ ఎస్ చేతిలోనే ఉండడంతో అధికార పార్టీ కార్పొరేటర్లపై చార్జి షీట్ రెడీ చేసే పనిలో  బీజేపీ లీడర్లు ఉన్నారు. ప్రస్తుతం గ్రేటర్లో బీజేపీకి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్యూర్స్  ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలతో విసిగిపోయిన వారిని గుర్తించి చేరదీసేందుకు సిద్ధమవుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీని నిలబెట్టుకోలేదని, గ్రేటర్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కరోనాను కంట్రోల్ చేయడంలో సర్కార్ చేతులెత్తేసిందని జనం కోపంగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని బీజేపీ నేతలు అంటున్నారు.