రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర : రాహుల్‌గాంధీ

 రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ  కుట్ర  :  రాహుల్‌గాంధీ

రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ  కుట్ర చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.  రాజ్యాంగం అనేది భారతీయుల ఆత్మ అని... అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ నేతలు మార్చుతామని అంటున్నారని చెప్పారు.  రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తున్నారన్నారు రాహుల్.  రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పైన ఉందని చెప్పారు. సరూర్ నగర్ లో జరిగిన జనజాతర సభలో ఆయన  పాల్గొన్నారు.  

మోదీ పదేళ్ల పాలనలో 20మంది బడా వ్యాపారులను బిలియనీర్లను చేశారని విమర్శించారు రాహుల్.  మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారన్నారు.  అంబానీ, అదానీ వంటి వారికి మోదీ రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు.  తాము అధికారంలోకి వస్తే  మహిళలందర్నీ లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని.. విప్లవాత్మకమైన మార్పుకు తాము శ్రీకారం చూడతున్నామని చెప్పారు. 

అంతేకాకుండా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామని..  రైతుల రుణమాఫీ చేస్తామన్నారు రాహుల్.  రైతులకు మద్దతు ధరను చట్టబద్థత చేస్తామని తెలిపారు.  నిరుద్యోగుల కోసం తాము అద్భుతమైన పథకాన్ని తీసుకువస్తున్నామని అన్నారు రాహుల్ గాంధీ. డిగ్రీ చదివిన ప్రతీ ఒక్కరికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ కాలేజీలు,  వర్సిటీల్లో ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు.