తెలంగాణలో ఎగరబోయేది కాషాయ జెండానే

తెలంగాణలో ఎగరబోయేది కాషాయ జెండానే

తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే.. ఎగురబోయేది కాషాయజెండానేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ ఆటలు ఇక సాగవని భావించిన సీఎం కేసీఆర్ పీకేను పెట్టుకున్నాడని..ఎవ్వరేం చేసినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌‌లో ఓ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు. ఉద్యోగం వస్తుందో, రాదోనన్న  బాధలో ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఏనాడూ ఆ కుటుంబాలను కనీసం టీఆర్ఎస్ నేతలు పరామర్శించలేదని విమర్శించారు. చీమ చిటుక్కుమన్నా మఫ్టీలో కూడా పట్టుకునేందుకు సిద్ధంగా ఉండే పోలీసులు.. 3 వేల మంది వాట్సప్ ల్లో మెసేజెస్ పెట్టుకుంటూ ఒక్కసారిగా రైల్వేస్టేషన్ లోకి చొరబడితే ఆపలేక.. ఎక్కడబోయిన్రు..? అని సూటిగా ఆయన ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆస్తుల విధ్వంసం జరగడమే కాకుండా కాల్పుల్లో ఓ యువకుడి మృతి చెందాడన్నారు. బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మరో గిరిజన మహిళకు అవకాశం కల్పిస్తోందని, కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుని వారికి రాజ్యాధికారం కల్పించే పార్టీ బీజేపీనేనని స్పష్టం చేశారు. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలుచోట్ల ఓబీసికి చెందినవారే ముఖ్యమంత్రులుగా ఉన్నారని ఈటల వ్యాఖ్యానించారు.