సర్కారు ఏర్పాటు చేయలేమన్న బీజేపీ..శివసేనకు చాన్స్

సర్కారు ఏర్పాటు చేయలేమన్న బీజేపీ..శివసేనకు చాన్స్

ముంబై: మహారాష్ట్రలో పాలిటిక్స్​ క్షణానికో మలుపు తిరుగుతుండటంతో  సర్కారు ఏర్పాటుపై టెన్షన్​ మరింత పెరిగింది. తగిన సంఖ్యాబలంలేని కారణంగా ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ నేతలు ఆదివారం గవర్నర్ భగత్​సింగ్​ కోశ్యారీకి చెప్పివచ్చారు. దీంతో గవర్నర్​ రెండో అతిపెద్ద పార్టీ శివసేనకు ఆహ్వానం పంపారు. సోమవారం రాత్రి 7:30లోగా ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వాలని శివసేనకు డెడ్​లైన్​ విధించారు. ఈ పరిణామాల తర్వాత ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్ కింగ్​మేకర్​గా మారారు. శివసేనకు పవార్​ మద్దతిస్తారా? ఇందుకు మిత్రపక్షం కాంగ్రెస్​ను ఎలా ఒప్పిస్తారు? అనేవి మిలియన్​ డాలర్​ ప్రశ్నలుగా మారాయి. రాష్ట్రపతి పాలనకు అంగీకరించబోమంటూ కాంగ్రెస్​ నేతలు చేసిన ప్రకటన శివసేన ఆశలు రెట్టింపయ్యేలా చేసింది. మొత్తంగా మహారాష్ట్రలో నాన్​బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా, రాష్ట్రపతి పాలన వస్తుందా అనేది ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. ఒకవేళ ఏ పార్టీ కూడా సర్కారు ఏర్పాటుకు రెడీగా లేకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్​ కోశ్యారీ కేంద్రాన్ని కోరేఅవకాశముంది.

శివసేన కోర్టులో బంతి

సర్కారు ఏర్పాటుకు నో చెప్పడం ద్వారా బీజేపీ తెలివిగా బంతిని శివసేన కోర్టులోకి నెట్టింది. బీజేపీతో గొడవల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠంపై మేమే కూర్చుంటామన్న శివసేన.. ఇవాళ రాత్రి 7:30లోగా ఆ పని చేసి చూపించాల్సిఉంది. సర్కారు ఏర్పాటుపై గవర్నర్​ నుంచి ఇన్విటేషన్​ వచ్చిన వెంటనే శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే పార్టీ నేతలతో హడావుడిగా భేటీ అయ్యారు. సేనకు మద్దతిచ్చేలా ఎన్సీపీ, కాంగ్రెస్​ను ఒప్పించే బాధ్యతను ఎంపీ సంజయ్​ రౌత్​కు అప్పగించినట్లు తెలిసింది. టైమ్​ తక్కువగా ఉండటంతో పొత్తు చర్చల్ని వేగవంతం చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఉద్ధవ్ ఐలాండ్​ రిసార్ట్స్​లో మకాం వేసిన సేన ఎమ్మెల్యేలతోనూ ఉద్ధవ్​ సమావేశమయ్యారు. శివసేన వ్యక్తే సీఎం అవుతారని ఎంపీ సంయజ్​ రౌత్​ మీడియాకు చెప్పారు.

బీజేపీ మాస్టర్​ స్కెచ్​

‘‘బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారు. కానీ శివసేన మాత్రం ఓటర్ల తీర్పును అవమానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ సొంతగా సర్కారు ఏర్పాటుచేసే పరిస్థితిలో లేదు. ఇదే విషయాన్ని గవర్నర్​కు వివరించాం. కాంగ్రెస్​, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసే అంటోంది. వాళ్లకు ఆల్​ ది బెస్ట్​”అని గవర్నర్​తో భేటీ తర్వాత మహారాష్ట్ర బీజేపీ చీఫ్​ చంద్రకాంత్​ పాటిల్​ అన్నారు. కేర్​టేకర్​ సీఎం ఫడ్నవిస్​ కూడా రాజ్​భవన్​కు వచ్చినప్పటికీ, మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్ర బీజేపీ కోర్​ కమిటీ రెండు సార్లు భేటీ అయింది. గవర్నర్​కు నిర్ణయాన్ని చెప్పిన తర్వాత రాత్రి మరోసారి నేతలంతా సమావేశమయ్యారు. శివసేన గనుక కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే అది ఆ రెండు పార్టీలకు కూడా చేటు చేస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్​ సపోర్టుతో సేన వ్యక్తి​ సీఎం అయినా, ఏడాదికి మించి ప్రభుత్వం నడవలేదని, కర్నాటకపరిస్థితే ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రపతి పాలన తప్పదనుకుంటే, కొన్ని రోజుల తర్వాతైనా శివసేన కలిసిరాక తప్పదని, ఒకవేళ మళ్లీ ఎన్నికలు తప్పవనుకుంటే ఈసారి ఒంటరిగా పోటీచేసి శివసేనకు బుద్ధిచెబుతామని బీజేపీ నేతలు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 75% స్ట్రైక్​ రేటు సాధించిందని, శివసేనతో పొత్తు వల్లే నష్టపోయామని వాళ్లు గుర్తుచేశారు. ఎలా చూసినా వెనక్కి తగ్గడం బీజేపీకి లాభమేనని హైకమాండ్​ కూడా భావిస్తున్నట్లు తెలిసింది.