మేమూ ఎమర్జెన్సీ బాధితులమే :తమిళిసై

మేమూ ఎమర్జెన్సీ బాధితులమే :తమిళిసై

హైదరాబాద్, వెలుగు:  పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుస్తోందని, ఇక్కడి నుంచే ఎక్కువ మంది కేంద్ర మంత్రులుగా ఉంటారని రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ఆమె..నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ సంస్థాగత కార్యదర్శి చంద్ర శేఖర్ సమక్షంలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ..తాను పది రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేస్తానని చెప్పారు.  ఇక్కడి ప్రజలను తిరిగి కలవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అధిష్టానం ఎక్కడ ప్రచారం చేయమంటే అక్కడ ప్రచారం చేస్తానన్నారు. 

తాను పోటీ చేసిన సౌత్ చెన్నై లోక్ సభ స్థానంలో హోరా హోరీ పోటీ ఉందని, కానీ తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తంచేశారు. రిజర్వేషన్లు తీసివేసే ప్రసక్తే లేదని తమిళిసై స్పష్టంచేశారు. దీనిపై కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చిందని, కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఫైరయ్యారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించింది ఎవరని ప్రశ్నించారు. తన కుటుంబం కూడా ఎమర్జెన్సీ బాధితుల్లో ఒకటని గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో తన తండ్రిని అరెస్ట్ చేశారని, ఏడాది పాటు జైల్లో పెట్టారని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని తమిళిసై మండిపడ్డారు. సమీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ఎన్నికల కమిటీ ప్రముఖ్ గీతామూర్తి, సహ ప్రముఖ్ కళ్యాణం గీతా రాణి, తమిళనాడుకు చెందిన నేతలు మునుసామి, మురుగన్, రాజస్థాన్ కు చెందిన అరుణ్ చతుర్వేది, రాజేంద్ర రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.