మేం ప్రూవ్ చేశాం.. దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచింది: రాహుల్ గాంధీ

మేం ప్రూవ్ చేశాం.. దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచింది: రాహుల్ గాంధీ

బెంగుళూరు: ఎన్నికల సంఘం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని.. ఈ విషయాన్ని మేం ప్రూవ్ చేశామని సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‎ను ఓడించేందుకు బీజేపీ, ఈసీ అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈసీ, బీజేపీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు.

 ఓట్ చోరీకి నిరసనగా కర్నాటక రాజధాని బెంగుళూరులో శుక్రవారం (ఆగస్ట్ 8) ఓట్ థెఫ్ట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితాలోని అవకతవకలను, అక్రమాలను మేం లేవనెత్తుతుంటే.. తప్పులు బయటపడొద్దని ఎన్నికల సంఘం తమ అధికారిక వెబ్ సైట్ క్లోజ్ చేసుకుంటుందని విమర్శించారు. 

మహారాష్ట్రలో ముందుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి అధిక సీట్లు దక్కాయి. లోక్ సభ ఎన్నికలు జరిగినా నాలుగు నెలల తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఫలితాలు తారుమారు అయ్యాయి. ప్రిపోల్స్, ఎగ్గిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ఇండియా కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసింది. నాలుగు నెలల్లోనే ఇండియా కూటమికి ఇంతలా ఎందుకు ఢీలా పడిందనే దానిపై మేం అంతర్గత విచారణ చేశాం. ఈ విచారణలో మాకు షాకింగ్ విషయాలు తెలిశాయి. 

మహారాష్ట్ర లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికల మధ్య గ్యాప్ కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఈ నాలుగు నెలల వ్యవధిలోనే కొత్తగా కోటీ ఓటర్లు నమోదు అయ్యారు. నిశీతంగా పరిశీలిస్తే ఇవన్నీ ఫేక్, బోగస్ ఓట్లని తేలింది. ఇలా ఎన్నికల్లో అక్రమాలు చేసి బీజేపీ విజయం సాధించిందని తెలిపారు రాహుల్ గాంధీ. కర్నాటక లోక్ సభ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగాయని.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1.50 వేల ఫేక్ ఓట్లు చేర్పించారని ఆరోపించారు. ఒక సింగల్ బెడ్ రూమ్ ఇంట్లోనే 40 మందికి పైగా ఓటర్లు ఉన్నారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కాషాయ పార్టీ భావజాలం భారత రాజ్యాంగానికి విరుద్ధమని.. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త రాజ్యాంగాన్ని రక్షిస్తామని పేర్కొన్నారు.