- వీఐపీల కారణంగానే మేడారంలో ట్రాఫిక్ సమస్య
- జాతర నిర్వహణపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నరు
- మహాజాతర సక్సెస్‌కు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు : మంత్రి సీతక్క
తాడ్వాయి, వెలుగు : ‘మేడారం మహాజాతర సమయంలో వీఐపీల ద్వారానే ట్రాఫిక్ సమస్య తలెత్తింది.. ఒక్కొక్కరు 20 కార్లు పట్టుకొని రావడంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని మంత్రి సీతక్క చెప్పారు. జాతర నిర్వహణపై కొందరు వ్యక్తులు కావాలనే అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించిన అనంతరం స్థానిక హరిత హోటల్‌లో మీడియాతో మాట్లాడారు.
మేడారం జాతర విజయవంతంలో ఆఫీసర్లతో పాటు మీడియా పాత్ర మరువలేనిదన్నారు. పస్రా – మేడారం రూట్‌లో ట్రాఫిక్ ఇబ్బంది రాలేదని, తాడ్వాయి నుంచి మేడారం వచ్చే వాహనాలతోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో భక్తులకు అసౌకర్యం కలిగిందన్నారు. ‘సీతక్క మొహం చాటేసింది’ అనే వారు అవగాహన లేకుండా, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీలతో కలిసి జాతర పనులు చూసుకుంటూ మేడారంలోనే ఉన్నానని స్పష్టం చేశారు. జాతరలో అపచారం జరుగుతుందని సోషల్ మీడియాలో చెబుతున్న స్వామీజీ.. ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే మేడారం అభివృద్ధి పనులను 90 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. తాము ఏదైనా తప్పు చేస్తే అమ్మవారే దండిస్తారన్నారు. ఆదివాసీల అస్తిత్వం, ఆత్మ గౌరవాన్ని, తల్లుల పట్ల భక్తిని కలిగి ఉన్న వ్యక్తినని చెప్పారు. మహాజాతర సక్సెస్‌ను జీర్ణించుకోలేక కొందరు వ్యక్తులు కావాలని చేసే కుట్రకు భయపడే వ్యక్తిని కాదన్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేయిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకుంటున్నామన్నారు. జాతర తర్వాత కూడా పారిశుద్ధ్య పనులు, వైద్య సేవలు కొనసాగుతాయన్నారు.
