వేతన జీవులకు నిరాశ... పన్నులకు పాత పద్ధతే.. మారని స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి

వేతన జీవులకు నిరాశ... పన్నులకు పాత పద్ధతే.. మారని స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి
  • ఏప్రిల్​ నుంచి కొత్త ఐటీ చట్టం
  • ఎన్​ఆర్​ఐల కోసం ఫాస్ట్​ డీఎస్​ స్కీమ్‌‌
  • అదనపు పన్ను కడితే చట్ట పరమైన చర్యల నుంచి రక్షణ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్​పన్ను చెల్లింపుదారులను నిరాశపర్చింది. పన్ను విధానాన్ని మార్చలేదు. ఆదాయపు పన్ను స్లాబులను మార్చకుండా యథాతథంగా ఉంచారు. ఇది పన్నుల వ్యవస్థలో స్థిరత్వాన్ని అందిస్తున్నప్పటికీ, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొత్తగా ఎలాంటి ఉపశమనాన్నీ అందించలేదు. స్టాండర్డ్​ డిడక్షన్​ను కూడా ప్రస్తుత స్థాయిలోనే (రూ.75 వేల దగ్గర) కొనసాగించారు. 

ఎలాంటి పెంపునూ ప్రకటించలేదు. ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఐటీ చట్టం చాలా సరళంగా ఉంటుందని, అన్ని రూల్స్​ను సులువుగా అర్థం చేసుకోవచ్చని నిర్మల ప్రకటించారు. 

పన్నుల విధానాల్లో రానున్న మార్పులు: ఐటీఆర్​ గడువు పొడిగింపు

ఐటీ రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. గతంలో ఇది డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉండేది.  పొరపాట్లు చేసిన పన్ను చెల్లింపుదారులకు తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఐటీఆర్–-1, ఐటీఆర్–-2 దాఖలు చేసేవారికి గడువు జులై 31 వరకు ఉంటుంది. 

ఆడిట్ అవసరం లేని వ్యాపారాలు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు సమయం ఇచ్చారు. ఇకపై వేర్వేరు కంపెనీలలో షేర్లు లేదా సెక్యూరిటీలు కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులు తమ ఫారమ్ 15జీ/ ఫారమ్ 15హెచ్​ను నేరుగా డిపాజిటరీల (ఎన్ఎస్​డీఎల్ లేదా సీడీఎస్ఎల్) ద్వారా అందించవచ్చు

విదేశీ టూర్లపై టీసీఎస్​ తగ్గింపు

విదేశీ పర్యటన ప్యాకేజీలపై వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్‌‌‌‌  (టీసీఎస్) రేటును 2 శాతానికి తగ్గించారు.  విదేశాలకు పంపే డబ్బుపై టీసీఎస్ 5 శాతం నుంచి 2 శాతం తగ్గింది.  ప్రవాస భారతీయుల నుంచి ఆస్తులు కొనేటప్పుడు ట్యాక్స్​ అసెస్​మెంట్​ నంబరు ( టీఏఎన్) అవసరం ఉండదు. పాన్ కార్డు ఆధారంగా  టీడీఎస్ చెల్లించవచ్చు. ఇకపై మ్యాన్ పవర్ సప్లైని కాంట్రాక్ట్ వర్క్‌‌‌‌గా పరిగణిస్తారు. దీనివల్ల టీడీఎస్ కోతలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది.

కంపెనీల మ్యాట్​  రేటు పెంపు

కొత్త కార్పొరేట్ పన్ను విధానాన్ని ప్రోత్సహించేందుకు మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ (మ్యాట్) రేటును 15 శాతం నుంచి 14 శాతం తగ్గించారు.  ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) లావాదేవీలపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్​ ట్యాక్స్​(ఎస్టీటీ)ను పెంచారు. షేర్ల బై బ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇకపై క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణిస్తారు. ప్రమోటర్లు బైబ్యాక్ చేసేటప్పుడు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఎన్నారైలు సేఫ్​!

విదేశాల్లో ఆస్తులు ఉండి, వాటి వివరాలు వెల్లడించని వారి కోసం ఫారిన్​ అసెట్స్​ డిస్​క్లోజర్​ స్కీమ్​ను (ఫాస్ట్- డీఎస్) ప్రకటించారు. విద్యార్థులు, యువ నిపుణులు, ఎన్నారైలకు ఇది ఉపయోగపడుతుంది. రూ.కోటి లోపు ఆస్తులు ఉండి కూడా వెల్లడించని వారు 30 శాతం పన్ను, మరో 30 శాతం అదనపు పన్ను చెల్లిస్తే చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు ఉంటుంది.  విదేశాల నుంచి ఇండియాకు తెచ్చే వస్తువులపై కస్టమ్స్​డ్యూటీని 50 శాతం తగ్గించారు.
 

కొత్త ఆదాయపు పన్ను చట్టం

ఈ ఏడాది ఏప్రిల్  నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. పాత చట్టంలోని సంక్లిష్టతలను తొలగించి, సరళమైన నిబంధనలు, ఫారాలను తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుంది. దీనిద్వారా ఐటీఆర్​ అందజేయడం సులువు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

స్థిరాస్తులపై టీడీఎస్ చెల్లింపు ఈజీ

ప్రవాస భారతీయుల స్థిరాస్తుల విక్రయాల సమయంలో టీడీఎస్ చెల్లింపును సులభతరం చేశారు. స్థానిక కొనుగోలుదారులు తమ పాన్ కార్డు ద్వారానే పన్ను జమ చేసే వీలు కల్పించారు.  ఇది రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచుతుంది.

క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు పన్ను మినహాయింపు

భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే  ప్రకటించారు.  సోలార్ గ్లాస్ తయారీలో ఉపయోగించే సోడియం యాంటీ మొనెట్ దిగుమతిపై కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు. బయో గ్యాస్ కలిపిన సీఎన్​జీపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు

జరిమానాలకు బదులు అదనపు మొత్తం

పన్ను చెల్లింపుదారులకు  జరిమానాలు విధించకుండా, అదనపు మొత్తాలను వసూలు చేస్తారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఆదాయాన్ని తక్కువగా చూపితే మాత్రం 100 శాతం జరిమానా విధిస్తారు. ఇది నిజాయితీగా పన్ను చెల్లించే వారికి భరోసా ఇస్తుంది. క్రిప్టో లావాదేవీల  వెల్లడించకపోతే రోజుకు రూ.200 జరిమానా విధిస్తారు.

చిన్న విదేశీ ఆస్తులకు మినహాయింపు

రూ.20 లక్షల లోపు విలువైన స్థిరాస్తి కాని విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోయినా, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇచ్చారు. ఇది చిన్న తరహా మదుపరులకు ఊరటనిచ్చే నిర్ణయం. మోటార్​ యాక్సిడెంట్లపై వచ్చే క్లెయిమ్స్​ మొత్తంపై పన్నును తొలగించారు.

చిన్న పన్నుచెల్లింపుదారులకు నిల్​ సర్టిఫికెట్లు

చిన్న పన్ను చెల్లింపుదారులు ఇక నుంచి వీళ్లు ‘నిల్’ సర్టిఫికెట్లు పొందవచ్చు. గతంలో పన్ను బాధ్యత లేకున్నా టీడీఎస్​ను మినహాయించేవారు. కొత్త విధానం వల్ల రీఫండ్లకు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ల క్యాష్​ ఫ్లో పెరుగుతుంది.