
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.ఇందులో భాగంగా బీజేపీ.. మిత్రపక్షంతో కలిసి శుక్రవారం భారీ ర్యాలీకి సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీ నేతృత్వంలో సభ జరుగనుంది.
అమిత్ షా కీలక ప్రకటన?
లక్నోలో జరగనున్న ర్యాలీలో హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ప్రస్తుతం ఓబీసీ కేటగిరిలో ఉన్న నిషాద్ లను షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టులో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై అమిత్ షా స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో యోగి, అఖిలేష్, ములాయం సింగ్ యాదవ్ లు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయారు. 17 ఓబీసీ కులాలను ఎస్సీ లిస్టులో చేర్చేందుకు ప్రయత్నించి.. చట్టపరమైన ఇబ్బందుల కారణంగా వెనక్కి తగ్గారు.
చిన్న పార్టీలతో పొత్తు
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పొత్తులకు సిద్ధమవుతున్నాయి.బీజేపీ ఇప్పటికే నిషాద్ పార్టీ, అప్నాదళ్, హిస్సేదారీ మోర్చా తదితర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నిర్వహిస్తున్న సభలకు భారీ సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయంపై కన్నేసిన అఖిలేష్ యాదవ్ చిన్న పార్టీలతో భాగస్వామ్యానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రగతీశీల్ సమాజ్ వాదీ పార్టీ, జన్ వాదీ పార్టీ, మహాన్ దళ్, ఎస్బీఎస్పీ, రాష్ట్రీయ లోక్ దళ్ తో అఖిలేష్ ఇప్పటికే జట్టు కట్టారు.
తూర్పు యూపీలో నిషాద్ పార్టీ హవా
నిషాద్ పార్టీని 2016లో సంజయ్ నిషాద్ ఏర్పాటుచేశారు. తూర్పు యూపీలో ప్రాబల్యం కలిగిన నిషాద్, మల్లాల మద్దతు ఈ పార్టీకి ఉంది. ఈ క్రమంలోనే నిషాద్ పార్టీ 2018 లోక్ సభ ఉప ఎన్నికల్లో గోరఖ్ పూర్ నుంచి పోటీ చేసి తొలి విజయం ఖాతాలో వేసుకుంది. యోగి ఆదిత్యనాథ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఒక కొత్త పార్టీ కైవసం చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏడాది తిరిగే సరికి ఆ పార్టీ బీజేపీతో జట్టు కట్టింది. పొత్తులో భాగంగా సంత్ కబీర్ నగర్ టికెట్ ను సంజయ్ నిషాద్ కు ఇవ్వగా ఆయన విజయం సాధించారు.