18న బీజేపీ ఫస్ట్ లిస్ట్!..హైకమాండ్కు చేరిన లిస్ట్

18న బీజేపీ ఫస్ట్ లిస్ట్!..హైకమాండ్కు చేరిన లిస్ట్
  • ఆశావహుల జాబితా 17న పార్టీ సెంట్రల్ 
  • ఎలక్షన్ కమిటీ భేటీ పార్టీ చీఫ్ నడ్డాతో  ప్రకాశ్ జవదేకర్ భేటీ  

న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెల 18న బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో అభ్యర్థుల స్క్రీనింగ్ పూర్తి కాగా, ఆ జాబితా హైకమాండ్ కు చేరింది. అయితే కేంద్ర నాయకత్వం బిజీ షెడ్యూల్, పీడ దినాల కారణంగా అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 17న ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ మీటింగ్ లో ప్రధానంగా తెలంగాణకు చెందిన అభ్యర్థులపై చర్చ జరగనుంది. మరోవైపు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదివారం పార్టీ తెలంగాణ ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్, బీఆర్ఎస్ మేనిఫెస్టో, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. 

బరిలో సిట్టింగ్ ఎంపీలు.. 

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోందని తెలిసింది. ప్రస్తుతం పార్టీకి రాష్ట్రం నుంచి ఉన్న నలుగురు లోక్ సభ, ఒక రాజ్య సభ ఎంపీని కూడా బరిలోకి దించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు హైకమాండ్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని ఎంపీలు తమ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం. 

ఎన్నికల్లో గెలుస్తం: జవదేకర్  

తెలంగాణలో బీజేపీ ప్రచారం జోరందుకుందని రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ పర్యటనలతో సమర శంఖం పూరించారని చెప్పారు. అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రుల పర్యటనలతో క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడిందన్నారు. ‘‘బూత్ లెవల్ వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. మా అంచనా ప్రకారం మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటాం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.