ఫ్లెక్సీలతో టీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేసింది

ఫ్లెక్సీలతో టీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేసింది
  • 3 నెలలపాటు పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ప్రధాని నరేంద్రమోడీ బహిరంగ సభ సక్సెస్ తో జోష్ మీదున్న బీజేపీ పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీని బలోపేతం చేయడం కోసం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం 7 పాయింట్స్ ఫార్ములాను రూపొందించింది. 

మంగళవారం (జులై 5న) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను పదాధికారులకు బండి సంజయ్ వివరించారు. పదాధికారుల సమావేశానికి బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం కోసం సెవెన్ పాయింట్స్  ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి సారి ఓటు వేసేవారిని బీజేపీ వైపు మళ్లించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. 

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో జాతీయ నేతల 48 గంటల పర్యటన

మూడు నెలల పాటు పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం చేపడుతామన్నారు బీజేపీ నేతలు. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్రమంత్రులు, జాతీయ నేతలు 48గంటల పాటు పర్యటించనున్నారు. మూడు నెలల పాటు ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం చేపడుతామన్నారు. పార్లమెంట్ ప్రభారి, పార్లమెంట్ కన్వీనర్, పార్లమెంట్ ఫుల్ టైం కార్యకర్తలతో త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించారు.

అదేవిధంగా.. అసెంబ్లీల పరిధిలో అసెంబ్లీ ప్రభారి, అసెంబ్లీ కన్వీనర్, అసెంబ్లీ ఫుల్ టైం కార్యకర్తలతో మరో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలు, జాతీయ, రాష్ట్ర పార్టీ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే గిరిజన తాండాలు, గ్రామాల్లో ఆమె చిత్ర పటాలతో ర్యాలీలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.

మరోవైపు పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్. బీజేపీ మీటింగ్ ఉందని పోటీగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి చిల్లర రాజకీయం చేసిందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ప్రచారానికి వస్తే ఫ్లెక్సీలు పెట్టడం బండిసంజయ్ ఏంటని ప్రశ్నించారు.