తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కమల దళం 50 సీట్లు గెలుచుకుంది. సీపీఎం నేతృత్వంలోని అధికార కూటమి ఎల్‌డీఎఫ్ కు 29 సీట్లే వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 19 సీట్లు సాధించింది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. ఒక వార్డు ఎన్నిక రద్దయింది. 45 ఏండ్లుగా ఇక్కడ ఆధిపత్యం వహిస్తున్న ఎల్‌డీఎఫ్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అలాగే ఎర్నాకుళం జిల్లాలోని పాలక్కాడ్, త్రిపునితురా మున్సిపాలిటీల్లోనూ బీజేపీ విజయం సాధించింది.
ఎల్డీఎఫ్ తో ప్రజలు విసిగిపోయారు: మోదీ
తిరువనంతపురం కార్పొరేషన్ ను బీజేపీ గెలుచుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేరళ రాజకీయాల్లో ఇదో కీలక మలుపుగా పేర్కొన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలను అభినందించారు. ప్రజలు యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ తో విసిగిపోయారని.. మంచి పాలన కోసం ఎన్‌డీఏను ఎంచుకున్నారని చెప్పారు. వికసిత్ కేరళ నిర్మాణం లక్ష్యంగా సాగుతామన్నారు. తిరువనంతపురం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
బీజేపీకి అభినందనలు: శశి థరూర్
`కేరళ స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభినందించారు. ‘‘కేరళ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తిరువనంతపురంలో సంచలన విజయం సాధించిన బీజేపీకి అభినందనలు. అక్కడ ఎల్డీఎఫ్ 45 ఏండ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాను. కానీ ప్రజలు యూడీఎఫ్‌ను కాకుండా వేరే పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
