
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫైర్
- నిరసనగా 21 నుంచి ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికల అంశంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి సంబంధించిన అంశాలను కాసం వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తామని, ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి 25 వరకు అన్ని మండలాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. జిల్లాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై త్వరలోనే సమావేశం జరుపుతామన్నారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, సంఘటనా మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర నేతలు సుభాష్, మాధవి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.