
రాబోయే ఎనిమిది నెలల్లో ఎన్నికలు రావచ్చని.. మిషన్ 90 పై ఫోకస్ చేయండంటూ బీజేపీ నేతలకు బీఎల్ సంతోష్ పిలుపునిచ్చారు. బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలన్నారు. ముఖ్యనేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ పెట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని చెప్పారు. వచ్చే మూడు నెలల్లోపు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వారానికి ఓ సారి మండలం, 15 రోజులకోసారి జిల్లా, నెలకోసారి రాష్ట్ర స్థాయిలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని బీఎల్ సంతోష్ స్పష్టం చేశారు.
ముఖ్యంగా తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని బీఎల్ సంతోష్ అన్నారు. ఎన్నికల హామీలతో పాటు రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని.. వాటిని గుర్తించి ఆందోళన కార్యక్రమాలకు కార్యచరణ రూపొందించాలని ఆయన చెప్పారు. జనవరి16 నుంచి బండి సంజయ్ నియోజకవర్గాలకు వెళ్లనున్నారని తెలిపారు. ఫిబ్రవరిలో ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారని బీఎల్ సంతోష్ వెల్లడించారు.