బ్లాక్ ఫ్రైడే సేల్స్ 27 శాతం జంప్.. హెల్దీ ఫుడ్స్కు మస్తు గిరాకీ

బ్లాక్ ఫ్రైడే సేల్స్ 27 శాతం జంప్.. హెల్దీ ఫుడ్స్కు మస్తు గిరాకీ
  • బ్యూటీ, హోమ్ కేటగిరీల్లోనూ జోష్​
  • యూనికామర్స్ స్టడీ రిపోర్ట్ వెల్లడి

న్యూఢిల్లీ: అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, మింత్రా వంటి ఈ–కామర్స్​కంపెనీలు బ్లాక్ ఫ్రైడే పేరుతో నిర్వహించిన సేల్స్​ అదరగొట్టాయి. గత నెల 28 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు సేల్స్ ​జరిగాయి. టెక్ కంపెనీ యూనికామర్స్ స్టడీ రిపోర్ట్​ ప్రకారం, గతేడాది బ్లాక్ ఫ్రైడేతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 27 శాతం పెరిగాయి. హెల్దీఫుడ్స్​, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయి. అమెరికాలో థాంక్స్ గివింగ్ డే తర్వాత నిర్వహించే దానిని బ్లాక్​ ఫ్రైడ్​సేల్​ అంటారు. 

ఇండియాలోనూ ఈ–కామర్స్​ కంపెనీలు ఇదే పేరుతో సేల్స్​ జరుపుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ 28న బ్లాక్ ఫ్రైడే వచ్చింది.  డీల్స్ రాయితీలు 'సైబర్ మండే' వరకు కొనసాగాయి.  ఇది బ్లాక్​  ఫ్రైడే అమ్మకాల తర్వాత  జరుగుతుంది. 2024 అమ్మకాలతో పోలిస్తే బ్లాక్ ఫ్రైడే వారంలో మొత్తం ఆర్డర్ల సంఖ్య సుమారు 27 శాతం పెరిగింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్​ఎంసీజీ), బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, హోమ్ ప్రొడక్ట్స్ విభాగాలు అత్యంత వేగంగా వృద్ధి చెందాయి.

ఎఫ్​ఎంసీజీ విభాగం ఏడాది ప్రాతిపదికన 83 శాతం వృద్ధితో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది. ముఖ్యంగా హెల్దీఫుడ్స్ బాగా  అమ్ముడయ్యాయి.  బ్యూటీ  విభాగం 77 శాతం పెరిగింది.  హోమ్ కేటగిరీ 63 శాతం వృద్ధి చెందింది.  ఫ్యాషన్, యాక్సెసరీస్  ఆర్డర్ల సంఖ్య 34 లక్షలకుపైగా ఉంది. 

పెద్ద నగరాల వాటా మొత్తం ఆర్డర్లలో 40 శాతం ఉంది. టైర్–2 నగరాల వాటా 23 శాతం, టైర్–3 నగరాల వాటా 37 శాతంగా ఉంది. ఈ నగరాల నుంచి 43 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఇది దాదాపు టైర్–1 స్థాయిలను చేరుకుంది. ఆన్​లైన్​ పేమెంట్స్​ బాగా పెరగడంతో చిన్న పట్టణాల నుంచి కూడా ఆన్​లైన్ ​షాపింగ్​ ఊపందుకుంటోంది.