
- నల్గొండ చౌరస్తా వద్ద డీ-సిల్టింగ్ లో వెలితీత
- అవగాహన కల్పించినా మారని జనం తీరు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : నగరంలోని పలు ప్రాంతాల్లోని డ్రైనేజీ లైన్లను కొంతమంది డస్ట్‌బిన్‌లుగా భావిస్తున్నారు. ఇష్టమున్నట్టు వ్యర్థాలు వేస్తుండడంతో సీవేజ్ఓవర్ఫ్లో సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా నల్గొండ చౌరస్తాలో డీసిల్టింగ్పనుల్లో భాగంగా మ్యాన్హోల్క్లీనింగ్ చేస్తుండగా బ్లాంకెట్లు, బెడ్షీట్లు బయటకు రావడంతో అధికారులు విస్తుపోయారు. శుక్రవారం వాటర్‌బోర్డు ఓ అండ్ ఎం డివిజన్–-2 పరిధిలోని రియాసత్ నగర్, మలక్ పేట, నల్గొండ చౌరస్తాలో సీవరేజ్ ఓవర్ ఫ్లోను అధికారులు అరికట్టారు.
జెట్టింగ్ మెషీన్‌తో సిల్ట్ ను బయటికి తీసి మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశారు. కాగా, ఇటీవల స్పెషల్ డ్రైవ్ లో ఇక్కడ డీ-సిల్టింగ్ చేసి సిల్ట్ తొలగించారు. కానీ స్థానికులు ఇష్టారీతిన వ్యర్థాలు వేస్తుండడంతో ఓవర్ ఫ్లో సమస్య పునరావృతం అవుతోంది. మ్యాన్ హోళ్లలో నుంచి బ్లాంకెట్లు, బెడ్ షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులను గుర్తించారు. ఇవి అడ్డుపడడంతోనే మురుగునీరు ఓవర్ ఫ్లో అవుతున్నట్టు అధికారులు తెలిపారు.
హోటళ్లు, ఆఫీసులు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య భవనాల యజమానులు, అపార్ట్మెంట్ల నిర్వాహకులు.. తమ సీవరేజ్ పైపు లైన్ ను నేరుగా వాటర్‌బోర్డు సీవరేజ్ నెట్ వర్క్ కు కనెక్ట్చేయడంతో వాటి నుంచి వచ్చే ఆహార, వ్యర్థ పదార్థాలు మ్యాన్ హోళ్లలో చేరుతున్నాయి. సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తుంది. ఫలితంగా సీవరేజ్ పైపు లైన్లపై ఒత్తిడి పెరిగి ఓవర్ ఫ్లో అవుతున్నాయి.