
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో సాయంత్రం దాటితే చలి తీవ్రతకు జనం ఇండ్లల్లో నుంచి బయటకు రావడం లేదు. ఫుట్‌పాత్‌లపై, స్లమ్ ఏరియాలో ఉండేవారు చలికి వణుకుతూ ఉంటారు. వీరి దుస్థితిపై చలించి పలు ఎన్జీవోలు, కొందరు దాతలు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. దుప్పట్లు, స్వెటర్లు, బట్టలు పంపిణీ చేస్తున్నారు.
నవంబర్ మొదటి వారం నుంచే..
సిటీకి చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు నవంబర్ మొదటి వారం నుంచి వింటర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. వలంటీర్లను నియమించి ముందుగా అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నాయి. బస్తీల్లో ఉండే వలస కూలీలతోపాటు బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ఫుట్‌పాత్‌ల మీద ఉండేవారిని గుర్తిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ నైట్ షెల్టర్స్, రోడ్ల పక్కన తలదాచుకుంటున్న వారు కూడా ఉన్నారు. వీరిని గుర్తించి లిస్ట్ ప్రకారం రెండు మూడు రోజుల్లో వారికి కావాల్సిన దుప్పట్లు తీసుకెళ్లి అందిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులపై ఫోకస్ పెడుతున్నట్లు ఎన్జీవోల నిర్వాహకులు చెప్తున్నారు.
అవసరమైన వారిని గుర్తించి..
మియాపూర్ మెట్రో పక్కన 400 గుడిసెలు, గౌలిదొడ్డిలో 300ల గుడిసెలు, నల్లగండ్లలో 400–600 మంది వలస కార్మికులు, బాలానగర్ వై జంక్షన్ పరిసర ప్రాంతాల్లోని బస్తీలను గుర్తించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సంకల్ప్ ఫౌండేషన్ నిర్వాహకురాలు డా. రోజీ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన నైట్ షెల్టర్‌కు, రోడ్ల పక్కన నివసించేవారికి అధికారులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చిన్నపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించడంలేదు. సిటీ వ్యాప్తంగా అవసరమైనవారిని గుర్తించి ఎన్జీవోలు సాయం చేస్తున్నాయి. దుప్పట్ల పంపిణీతోపాటు చిన్నారులకు ప్రోటీన్ మీల్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు డ్రైవ్
బట్టలు సరిగా లేని గుర్తిస్తున్నం. రాత్రి వేళలో రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్లు, ఫ్లై ఓవర్ల దగ్గర ఉంటున్న వారికి, స్లమ్ ఏరియాలకు వెళ్లి బట్టలు ఇస్తున్నాం. మా దగ్గర 10 మంది వలంటీర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 1200 మందికి పైనే బట్టలు, స్వెటర్లు, దుప్పట్లు అందించాం. ఈ నెలాఖరు వరకు వింటర్ డ్రైవ్ కొనసాగుతుంది.
- డా. రోజీ, సంకల్ప్ ఫౌండేషన్, ఎన్జీవో
చిన్నారుల కోసం..
పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ ఎన్జీవో తరఫున చిన్నారులకు కావాల్సిన అవసరాలను తీరుస్తుంటాం. స్కూళ్లు మొదలయ్యే టైమ్‌లో పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, బట్టలు వంటివి అందజేస్తాం. చలికాలం మొదలయ్యాక స్వెటర్లు, దుప్పట్లు తీసుకెళ్లి ఇస్తున్నాం. ఇందుకోసం దాతలు ఎంతో కొంత సాయం చేస్తుంటారు.
- సంతోశ్, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్, ఎన్జీవో