క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ మోసం.. మెటాఫండ్ కింగ్పిన్ అరెస్టు.. ఎంత ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటే

క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ మోసం.. మెటాఫండ్ కింగ్పిన్ అరెస్టు.. ఎంత ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటే

క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్ పేరిట జరుగుతున్న మోసాల వెనుక ఉన్న సూత్రదారులు, పాత్రదారులు ఒక్కొక్కరుగా పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 60 కోట్ల రూపాయల దందాకు పాల్పడిన దుండగులను ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లేటెస్టుగాఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రధాన సూత్రదారి, కింగ్ పిన్ వరాల లోకేశ్వర్ రావును అరెస్టు చేసిన వివరాలను  గురువారం (అక్టోబర్ 16)  మీడియాకు వెల్లడించారు. 

కరీంనగర్ కు చెందిన తులసీ ప్రకాష్ తో 2024లో  స్నేహం తర్వాత మెటాఫండ్, బిట్ కాయిన్ పేరిట మోసాలకు తెర తీసింది ఈ ముఠా. తులసీ ప్రకాష్ తో పాటు బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ తో  జట్టు కట్టిన లోకేశ్వర్ రావు.. ఇన్వెస్టుమెంట్ పేరున దాదాపు రూ.60 కోట్ల మోసాలకు పాల్పడ్డారు. 

యూబిట్ తరహాలో మెటాఫండ్ పేరిట ఓ నకిలీ యాప్ సృష్టించారు ఈ కేటుగాళ్లు. 90 వేల రూపాయలకు  వెయ్యి కాయిన్స్ ఇచ్చి నెలలో మూడింతల డబ్బు వస్తుందని నమ్మబలికి సమాన్యులను వలలో వేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో ఘనంగా మెటాఫండ్ యూబిట్ కాయిన్స్ లాంచింగ్ కార్యక్రమం చేశారు. 

ఈ కేటుగాళ్ల 450 మంది బాధితుల నుంచి 25 నుంచి 30 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్, టూ టౌన్ పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. 

ఇప్పటికే దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్, బూర శ్రీధర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బుధవారం (అక్టోబర్ 15) కింగ్ పిన్ లోకేశ్వర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుడి నుంచి ఆస్తుల పత్రాలు, 30 తులాల బంగారం, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, బీఎండబ్ల్యూ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గురువారం (అక్టోబర్ 16) మీడియాకు వెల్లడించారు.