Vijay Deverakonda: 'VD14'లో విజయ్ దేవరకొండ విశ్వరూపం.. రెండు విభిన్నషేడ్స్‌లో ఎంట్రీ!

Vijay Deverakonda: 'VD14'లో విజయ్ దేవరకొండ విశ్వరూపం.. రెండు విభిన్నషేడ్స్‌లో ఎంట్రీ!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ లో వస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం ' VD14' . భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ గురించి లేటెస్ట్ గా డైరెక్టర్ ఆసక్తికరమైన అప్డేట్ అందించారు.  ఈ సినిమాలో విజయ్ విశ్వరూపం చూస్తారని చెప్పారు. ఈ రౌడీ హీరోను సరికొత్త కోణంలో ప్రేక్షకులు చూడబోతున్నారని ఇటీవల జరిగిన 'డ్యూడ్' ప్రమోషనల్ ఈవెంట్ లో హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో విజయ్ నటనను చూసినప్పుడు ప్రేక్షకులు పక్కాగా షాక్ అవుతారు. అతని విశ్వరూపాన్ని పూర్తిస్థాయిలో చూస్తారు అని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

కాలాతీత పోరాట గాథ

VD14 చిత్రం విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. 2018లో వచ్చిన వారి తొలి సూపర్ నేచురల్ చిత్రం 'టాక్సీవాలా' మంచి విజయం సాధించింది. అయితే, ఈసారి ఈ ద్వయం భారీ ఎత్తున, మునుపెన్నడూ చూడని పీరియడ్ యాక్షన్ డ్రామాతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కథాంశం 1854 నుండి 1878 మధ్య, అంటే బ్రిటీష్ వలస పాలన ఉచ్ఛదశలో ఉన్న సమయాన్ని ప్రతిబింబిస్తుంది. నిజ జీవిత చారిత్రక సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం ముఖ్యంగా బ్రిటీష్ పాలనపై ప్రతిఘటన, విప్లవం, వ్యక్తిత్వం అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. విజయ్ దేవరకొండ పోషిస్తున్న పాత్ర ఈ చారిత్రక పోరాటానికి కేంద్ర బిందువుగా నిలుస్తుందని, ఇందులో అతని పాత్ర రెండు విభిన్న షేడ్స్‌లో ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో మేకర్స్ ప్లాన్.. 

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని ,  వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ సహ సమర్పణలో తెరకెక్కుతోంది. VD14 స్కేల్ , సెంటిమెంట్‌ల కలయికగా ఉంటూ, తెలుగు పీరియడ్ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిర్మాతల నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, అంతర్జాతీయంగా 'ది మమ్మీ' ఫ్రాంచైజీకి ప్రసిద్ధి చెందిన నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో కీలకమైన బ్రిటీష్ అధికారి పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

VD14లో సినిమాటోగ్రఫీ, సంగీతం , ప్రొడక్షన్ డిజైన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా, చారిత్రక వాస్తవికతను భావోద్వేగ డ్రామాతో మేళవించి, ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్పెక్టకిల్‌గా ప్రేక్షకులకు అందించాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామాలలో ఒకటిగా నిలవనుందని అంచనా వేస్తున్నారు.