Chiru-TilakVarma: మెగాస్టార్ సెట్‌లో తిలక్ వర్మ.. కేక్ కట్ చేసి సత్కరించిన చిరంజీవి!

Chiru-TilakVarma: మెగాస్టార్ సెట్‌లో తిలక్ వర్మ.. కేక్ కట్ చేసి సత్కరించిన చిరంజీవి!

ఆసియా కప్ హీరో, యువ క్రికెటర్ తిలక్ వర్మ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో  'మనశంకరవరప్రసాద్‌గారు' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా సెట్ కు వచ్చిన  తిలక్ వర్మను చిరు సత్కరించారు. ఇటీవల ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా సాధించిన ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను అభినందించారు

మెగాస్టార్ సెట్‌లో తిలక్ వర్మకు సన్మానం.. 

హైదరాబాద్‌కు చెందిన యువ సంచలనం తిలక్ వర్మ టాలెంట్, అంకితభావం , పోరాట స్ఫూర్తిని మెగాస్టార్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా, మూవీ సెట్‌లో తిలక్ వర్మ కేక్ కట్ చేశారు. చిరంజీవి స్వయంగా అతనికి ఆసియా కప్‌ ఫైనల్ నాటి ప్రత్యేక ఫోటోను బహుమతిగా అందించారు. ఈ అరుదైన క్షణంలో చిరంజీవితో పాటు హీరోయిన్ నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత కొణిదెల కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు,  వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి, అభిమానుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

 

దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ విజయం తర్వాత పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పుడు మెగాస్టార్ నుండి అభినందన అందుకోవడంతో తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన 'మీసాల పిల్ల' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాతో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.