ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ

ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం ఎలాంటి అను మతి లేకుండా గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), తెలంగాణ ప్రాజెక్టు (టీజీపీ) ఆధారంగా చేపట్టిన లిఫ్ట్ స్కీములను వెంటనే నిలిపి వేయించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. కేఆర్ఎంబీ చైర్మన్ శివ్​నందన్ కుమార్​కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం ఈమేరకు లేఖ రాశారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ సహా ఎలాంటి అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టులను ఏపీ చేపడుతున్నదని వివరించారు.

ఇప్పటికే తాము నాలుగు సార్లు బోర్డు దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. జీఎన్ఎస్ఎస్ పరిధిలోని లాలేటివాగు రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఎత్తిపోతల పథకం, అన్నమయ్య జిల్లా కలిబండ గ్రామంలో, బెస్తపల్లిలో ఎత్తిపోతల పథకాలు, అదే జిల్లాలోని చెరువుముందరిపల్లిలోని జరికొండ రిజర్వాయ్ నుంచి లిఫ్ట్​స్కీమ్ చేపట్టారని వివరించారు. కడప జిల్లాలోని ఇటుగులపాడు, సవిశెట్టిపల్లి, కొండ్రాజుపల్లి, వారికుంట్ల, గంగనపల్లి చెరువులు నింపేందుకు మరో లిఫ్ట్ స్కీం పనులు చేపట్టారని వివరించారు.