ఫోన్ ట్యాపింగ్‌‌ను అడ్డుపెట్టుకొని..వేల కోట్ల అక్రమాలు

ఫోన్ ట్యాపింగ్‌‌ను అడ్డుపెట్టుకొని..వేల కోట్ల అక్రమాలు
  • వ్యాపారులు, కాంట్రాక్టర్లను
  • బ్లాక్​మెయిల్​ చేసిన్రు
  • ఎన్నికల్లో పట్టుబడ్డ డబ్బును
  • పక్కదారి పట్టించిన్రు
  • నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలనూ వదిలిపెట్టలే
  • వావివరుసలు మరిచి సొంత బిడ్డ ఫోన్లనూ విన్నరు 
  • రేవంత్ కూడా బాధితుడే.. ఆయననూ సిట్​ విచారించాలి 
  • స్కామ్‌‌లపై కమిషన్లు వేస్తున్న సర్కార్.. చర్యలు తీసుకోవట్లే 
  • కేసును సీబీఐకి ఇస్తే కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ను జైల్లో పెట్టేవాళ్లం
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ ​మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది
  • కేసీఆర్‌‌‌‌ను అరెస్ట్ ​చేయబోమని సీఎం ఎట్ల చెప్తరు?
  • ఇప్పటికైనా కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ 
  • సాక్షిగా సిట్​ ముందు హాజరై కేంద్రమంత్రి స్టేట్​మెంట్​


హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్​ ట్యాపింగ్‌‌ను​ అడ్డుపెట్టుకొని కేసీఆర్, కేటీఆర్ వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని.. వ్యాపారులను, కాంట్రాక్టర్లను బెదిరించి వందల కోట్లు దోచుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ఆరోపించారు. ఎన్నికల్లో పట్టుబడిన డబ్బును పెద్ద మొత్తంలో దారిమళ్లించారని అన్నారు.

‘‘వావివరుసలు మరిచి భార్యాభర్తల ఫోన్లను, ఆఖరికి సొంత బిడ్డ, అల్లుడి ఫోన్లను విన్న నీచులు వీళ్లు.. ఎస్‌‌ఐబీని అడ్డుపెట్టుకొని ప్రభాకర్ రావు, రాధాకిషన్​రావుతో కలిసి దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎక్కడికెళ్లాయో లెక్క తేలాలంటే సిట్​తో సాధ్యం కాదు.. టెలికాం రెగ్యులేటరీ విధానాలను పాటించకుండా కేసీఆర్‌‌‌‌ అడ్డగోలుగా వ్యవహరించారు.

 ఇందులో దేశభద్రతతో ముడిపడిన అంశాలు ఉన్నాయి. సీబీఐతో విచారణ చేయిస్తేనే ఇవన్నీ బయటపడతాయి. అందువల్లే ఫోన్​ ట్యాపింగ్‌‌పై సీబీఐ ఎంక్వైరీ కోరుతూ సీఎం రేవంత్‌‌ రెడ్డి వెంటనే కేంద్రానికి లేఖ రాయాలి’’ అని డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా కేసీఆర్ హయాంలో జీవో తెచ్చారని, ఒకవేళ సీబీఐ నేరుగా విచారణ జరిపే అవకాశముంటే.. ఈపాటికే కేసీఆర్‌, ఆయన కొడుకును గుంజుకుపోయి జైల్లో వేసే వాళ్లమన్నారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షిగా శుక్రవారం సిట్‌ విచారణకు బండి సంజయ్​హాజరయ్యారు. రాజ్‌భవన్‌ రోడ్డులోని దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌లో అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు వాంగ్మూలం తీసుకున్నారు. సిట్‌ విచారణ ముగిసిన అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. 

వాళ్లకు వావివరుసలు లేవు..

కేసీఆర్, కేటీఆర్‌‌కు వావివరుసలు లేవని సంజయ్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్, కేటీఆర్ ​దుర్మార్గులు.. నీచులు.. వీళ్లకు వావివరుసలు ఏమీ లేవు. భార్యాభర్తల ఫోన్లు, చివరికి తన సొంత బిడ్డ కవిత, అల్లుడు సహా కుటుంబ సభ్యుల ఫోన్లను వదలకుండా ట్యాపింగ్‌ చేయించారు. ఎవడన్నా భార్యాభర్తల ఫోన్లు వింటరా? సిగ్గు మాలిన కుటుంబం వీళ్లది. 

కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్‌ కాల్ మాట్లాడుకోలే. ఆఖరికి బిచ్చగాళ్లు కూడా భార్యలతో ఫోన్ మాట్లాడాలంటే భయపడ్డరు. సీఎం ఫోన్లు వింటండట అని చెప్పేటోళ్లు. వాట్సాప్‌, ఫేస్‌ టైమ్‌, సిగ్నల్‌ల మాట్లాడుకున్నరు. ఇంత ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంల ఉండె. హరీశ్‌ రావుతో పాటు అప్పటి మంత్రులు, బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్​ చేశారు. 

వాళ్లను కూడా విచారణకు పిలవాలి’’ అని డిమాండ్ ​చేశారు. నాటి పీసీసీ చీఫ్‌, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్​ ట్యాపింగ్ ​బాధితుడేనని.. ఆయన ఎందుకు సిట్ విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. 

వ్యాపారులను బ్లాక్ ​మెయిల్ ​చేసిన్రు..

ఫోన్​ట్యాపింగ్‌కు పాల్పడిన  ప్రభాకర్​రావు, రాధాకిషన్​రావుల బాగోతం మామూలుది కాదని.. వాళ్లను సమాజం క్షమించదని సంజయ్ అన్నారు. వీళ్లకు ఉరిశిక్ష వేస్తే ఒకేసారి సచ్చిపోతారని, వాళ్లు చేసిన పాపాలు ప్రతి క్షణం తలుచుకుని కుళ్లి కుళ్లి ఏడ్చేలా శిక్ష విధించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘వీళ్లిద్దరూ చాలామంది వ్యాపారుల ఫోన్లు ట్యాప్​చేసి వాళ్ల లావాదేవీలు, బిజినెస్​రహస్యాలు తెలుసుకొని కేటీఆర్‌‌కు చెప్పేవారు.

 ఆ సమాచారంతో సదరు వ్యాపారులను కేటీఆర్ బ్లాక్​మెయిల్​చేసి వేల కోట్లు వసూలు చేసేవాడు. ఎస్‌ఐబీని అడ్డుపెట్టుకొని కాంట్రాక్టర్లు, లీడర్లను ఇలాగే బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వద్ద గత ఎన్నికల సమయంలో రూ.7 కోట్లు పట్టుకున్నరు. ఆ పైసలు ఏమైనయ్.. ఏ అకౌంట్లలో పడ్డయో తెలియదు.. ఇంకా కాంగ్రెస్ నేతల వద్ద వందల కోట్లు పట్టుకున్నరు. 

అవన్నీ కేసీఆర్, కేటీఆర్​కుటుంబానికి పోయినయ్. రూ.20 కోట్లు దొరికినయ్​అని టీవీల్లో బ్రేకింగ్​వస్తది. కేసీఆర్, కేటీఆర్​ఫోన్​చేయంగనే అవి రూ.2 కోట్లయితయ్. 18 కోట్లు కేసీఆర్, కేటీఆరే దొబ్బిపోతరు’’ అని ఆరోపించారు. ఇన్ని వేల కోట్ల అక్రమాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి ఎందుకు లేఖ రాయడం లేదని ​ప్రశ్నించారు. ఈడీకి లేఖ రాస్తే తక్షణమే విచారణ చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

ఫోన్ ​ట్యాపింగ్​ కేసును సీబీఐకి అప్పగించాలి.. 

సిట్​అధికారులు నిజాయతీపరులని, వాళ్లపై తమకు నమ్మకం ఉందని సంజయ్​చెప్పారు. కానీ రేవంత్​సర్కారు మీదనే తనకు నమ్మకం లేదన్నారు. ‘‘ఫోన్​ట్యాపింగ్​బయటపడి సంవత్సరం గడిచినా, వేల కోట్లు అక్రమాలు జరిగినట్లు ఆధారాలు దొరికినా, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్​చేయలేదు. కమిషన్లు వేయడం, టైం పాస్​చేయడం తప్ప కమిషన్లు రిపోర్టులు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. 

సీఎం ఫోన్​ కూడా ట్యాప్​అయింది. కానీ ఆయనను సిట్​ముందుకు పిలవడం లేదు. కేసీఆర్, కేటీఆర్‌‌ను విచారణకు పిలిచే దమ్ము లేదు. జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం లేదు. అందుకే ఫోన్​ట్యాపింగ్​కేసును సిట్​నుంచి తీసి సీబీఐకి అప్పగించాలి” అని డిమాండ్​చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​మధ్య అవగాహన కుదిరినందునే కేసీఆర్, కేటీఆర్​జోలికి రేవంత్ రెడ్డి వెళ్లడం లేదని మండిపడ్డారు. 

‘‘ఫాంహౌస్​ కేసు, ఫోన్​ ట్యాపింగ్ ​కేసు, డ్రగ్స్​ కేసు, కాళేశ్వరం కేసు అంటూ కమిషన్లు వేస్తున్నరు. అవి కొనసాగుతుండగానే కేటీఆర్​ ఢిల్లీ పోయి కాంగ్రెస్​నేతలకు వందల కోట్ల మూటలు అప్పజెప్తున్నడు.. నాడు కేసీఆర్‌‌కు కాళేశ్వరం ఏటీఎం లెక్క మారినట్లే ఇక్కడ రాష్ట్ర సర్కారు వేస్తున్న కమిషన్లు ఢిల్లీ కాంగ్రెస్​ నేతలకు ఏటీఎంలా మారాయి. అందుకే కేసీఆర్‌‌కు రేవంత్​క్లీన్‌చీట్ ఇచ్చారు’’ అని ఆరోపించారు. 

కేసీఆర్‌‌ను అరెస్ట్​చేయబోమని రేవంత్​రెడ్డి ఇటీవల చెప్పడంతో ఆ రెండు పార్టీల నడుమ ఉన్న లోపాయికారి ఒప్పందం బయటపడిందన్నారు. కేసీఆర్‌‌ను అరెస్ట్​చేయబోమని చెప్పేందుకు రేవంత్​రెడ్డికి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. ‘‘కమిషన్లు వేయడం, రేట్లు మాట్లాడుకోవడం, మేము ఎవరినీ అరెస్ట్​ చేయబోం అని ఆఫీసర్లకు చెప్పడం, టైం పాస్​చేయడం.. కాంగ్రెస్​సర్కారు చేస్తున్నది ఇదే. 

ఇంతమాత్రానికి ఈ కమిషన్లు ఎందుకు? ఈ విచారణ ఎందుకు? తెలంగాణ సమాజం పిచ్చోళ్లా.. ఈ ఫోన్​ట్యాపింగ్​విచారణ మీతో కాదు.. మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు.. వేల కోట్ల స్కామ్​జరిగింది గనుక కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి’’ అని సంజయ్​డిమాండ్​చేశారు. 

సిట్‌కు పలు ఆధారాలు అందించిన సంజయ్‌.. 

ఫోన్‌ ట్యాపింగ్‌ మొదటి బాధితుడిని తానేనని, బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి తనపై అప్పటి బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని సిట్‌కు సంజయ్​ వివరించారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల సమయంలోనూ తన ఫోన్​ట్యాప్​చేశారని చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంజయ్ వినియోగించిన రెండు ఫోన్ నంబర్లు కూడా ట్యాప్ ​అయినట్లు ఆయనకు సిట్ ​వివరించింది. 

ఆ రెండు ఫోన్​నంబర్లపై సంజయ్ ​స్టేట్​మెంట్లను రికార్డ్ చేసినట్లు తెలిసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి సేకరించిన పలు డాక్యుమెంట్లను సిట్ అధికారులకు సంజయ్ అందించారు. 

నేనే మొదటి బాధితుడ్ని.. 

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో నేనే మొదటి బాధితుడ్ని. సిట్ అధికారులు వెల్లడించిన విషయాలు నన్ను షాక్‌‌కు గురి చేశాయి. గత కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం మావోయిస్టుల పేర్లు చెప్పి.. నాతో పాటు 6,500 మంది ఫోన్లను ట్యాప్ చేయించింది. నా ఫోన్‌‌తో పాటు నా కుటుంబసభ్యులు, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్​ చేసిన్రు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఎప్పుడు ఆందోళన చేసినా, ఎటు వెళ్దామన్నా పోలీసులు ముందే వచ్చేటోళ్లు. దీంతో అనుమానం వచ్చి అప్పట్లోనే ఫోన్​ట్యాపింగ్​ విషయాన్ని బయటపెట్టాను. వ్యాపారులు, అడ్వొకేట్లు, సినిమావాళ్లు, ప్రొఫెసర్లు, ఆఖరికి టీఎస్‌‌పీఎస్సీ పేపర్ ​లీకేజీ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్‌‌నూ ట్యాప్​ చేశారు. 

- సంజయ్