దలాల్ స్ట్రీట్‌లో గురువారం భారీ రక్తపాతం చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుదల స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చింది. మార్కెట్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.
ఒక్కరోజు వ్యవధిలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్టెడ్ కంపెనీల సంపద ఆవిరైంది. మార్కెట్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.11 లక్షల కోట్లకు పైగా ఆవిరి కావడం అందరినీ షాక్ కి గురిచేసింది.
ఈ పతనంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 1045 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ50 కూడా 371 పాయింట్లు కోల్పోయింది. ఆటోమొబైల్ షేర్లు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104 డాలర్లకు ఎగబాకడం మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ముదవడం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు ఉత్పత్తి నిలిచిపోవడం వంటి పరిణామాలు భారత్ వంటి ఇంధన దిగుమతి దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
దేశీయంగా రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం, విదేశీ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు కలసి ఇన్వెస్టర్లను భయాందోళనకు గురిచేశాయి. ఈ కారణంగా ఒక్కరోజే రూ.11 లక్షల కోట్ల సంపద కరిగిపోవడంతో దళాల్ స్ట్రీట్‌లో తీవ్ర నిరాశాజనక వాతావరణం నెలకొంది. బేర్స్ చేతిలో మార్కెట్లు చిక్కుకోవటానికి మరో కీలక కారణం విదేశీ ఇన్వెస్టర్లు భారీగా తమ పెట్టుబడులను క్యాష్ ఔట్ చేయటమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
