యూపీలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ

యూపీలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ
  • తాజాగా మంత్రి ధరమ్ సింగ్, ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ రాజీనామా
  • 3 రోజుల్లో మొత్తం 9 మంది గుడ్ బై.. ఇందులో 8 మంది ఎస్పీలోకి వెళ్లే చాన్స్!
  • రోజూ ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తరు: ధరమ్ సింగ్
  • కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎస్పీ నుంచి ఇద్దరు బీజేపీలోకి 

లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా రిజైన్ చేస్తున్నారు. గురువారం ఓ మంత్రి, ఇంకో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మూడు రోజుల్లోనే ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వచ్చారు. వీరంతా సమాజ్‌‌వాదీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు ఎస్పీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీలోకి చేరారు. దీంతో ఎన్నికలకు నెల రోజుల ముందే యూపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.  
24 గంటల్లోనే మాట మార్చిండు..
మంగళవారం స్వామి ప్రసాద్ మౌర్య, బుధవారం దారా సింగ్ తమ మంత్రి పదవులకు, బీజేపీకి రాజీనామా చేశారు. గురువారం ఆ లిస్టులో ధరమ్ సింగ్ సైనీ చేరారు. ఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సహరణ్‌‌పూర్‌‌‌‌లోని నాకుడ్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓబీసీ నేత ధరమ్‌‌ సింగ్ బుధవారం మాట్లాడుతూ.. తన కంటే ముందుగా బీజేపీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్యపై విమర్శలు చేశారు. కానీ 24 గంటలు కూడా గడవకముందే మాట మార్చారు. ధరమ్‌‌ సింగ్‌‌ను బుజ్జగించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నించారని, ఫోన్ చేశారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ కూడా బీజేపీకి రాజీనామా చేశారు.  అంతకుముందు అవతార్ సింగ్ భదానా, బ్రిజేశ్ కుమార్ ప్రజాపతి, భగవతి సాగర్, రోషన్ లాల్ వర్మ, వినయ్ శక్య కూడా బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ మిత్ర పక్షం అప్నా దళ్‌‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు.  
రోజూ రాజీనామాలుంటయ్: ధరమ్ సింగ్
ఈనెల 20 దాకా ప్రతి రోజూ ఒక మంత్రి, ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేస్తారని ధరమ్ సింగ్ చెప్పారు. ‘‘బీజేపీ యాంటీ దళిత్, యాంటీ ఓబీసీ పాలసీలకు వ్యతిరేకంగా 140 మంది ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. పార్టీలోనే బెదిరింపులకు గురయ్యారు. టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని అప్పుడే అందరూ నిర్ణయించుకున్నారు” అని చెప్పారు.  
బీసీ ఓటు బ్యాంకు లక్ష్యంగా అఖిలేశ్ పావులు
యూపీలో 50 శాతం పైగా ఓటర్లు ఓబీసీలే. 2017 యూపీ ఎన్నికల్లో నాన్ యాదవ్ ఓబీసీ ఓట్లపైనే ఫోకస్ చేసి బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను అఖిలేశ్‌‌ ఫాలో అవుతున్నారు. ఇక దారా చౌహాన్ సింగ్ కూడ ఓబీసీ (నోనియా) నేతనే. 2014 ఎన్నికల తర్వాత బీజేపీ ఓటు బ్యాంకుగా ఈ కమ్యూనిటీ మారింది. గతంలో బీఎస్పీలో ఉన్న ధరమ్‌‌.. 2016లో స్వామి ప్రసాద్ మౌర్యతో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఇద్దరూ ఎస్పీలోకి వెళ్లారు. 2017లో బీజేపీ గెలుపుకు దారా సింగ్, స్వామి ప్రసాద్ మౌర్య చేరిక ఉపయోగపడింది. ఇక మిగతా నేతలు బ్రిజేశ్ ప్రజాపతి (ప్రజాపతి–ఓబీసీ), భగవతి సాగర్ (కురీల్–దళిత్), రోషన్ లాల్ వర్మ (లోధ్–ఓబీసీ), వినయ్ శక్య (మౌర్య–ఓబీసీ) తదితర నాయకులు ఇప్పటికే బీజేపీకి గుడ్‌‌బై చెప్పారు. అందరూ ఒకే రీతిలో రాజీనామాలు చేస్తుండగా.. ఆ వెంటనే వెల్కమ్ చెబుతూ అఖిలేశ్ ట్వీట్ చేస్తున్నారు.  గురువారం భీమ్​ఆర్మీ చీఫ్​ చంద్రశేఖర్​ఆజాద్​తోనూ అఖిలేష్​ యాదవ్​ భేటీ అయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్  ప్రకటించారు. 
బ్లాక్‌‌లో టికెట్లు ఇస్తున్రు: బీజేపీ  
డబుల్ ఇంజిన్ ట్రైన్‌‌లో టికెట్లు దొరకని వాళ్లందరూ.. గతంలో ఓడిన టిప్పు సుల్తాన్‌‌ వెహికల్‌‌లో బ్లాక్ టికెట్లు పొందుతున్నారని యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ఎద్దేవా చేశారు. కాగా, సిర్సాగంజ్‌‌ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్.. అఖిలేశ్ యాదవ్‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూట్లు నాకే వాళ్లతో పార్టీ నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం ఈయన బీజేపీలో చేరారు. ఎస్పీ ఎమ్మెల్యే ధరమ్‌‌పాల్ సింగ్, కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే సరేశ్ సైనీ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశలో 172 సీట్ల కేటాయింపుపై గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశమై చర్చించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి, కేశవ్​ప్రసాద్​మౌర్య సిరతు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఉన్నావ్ బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్
2017 నాటి ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి ఆశా సింగ్‌‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గురువారం ఈ మేరకు 125 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ రిలీజ్ చేశారు. ఉన్నావ్ జిల్లాలోని బంగర్మవ్ స్థానంలో ఆశా సింగ్‌‌ను నిలబెట్టారు. 2017లో బీజేపీ నుంచి బంగర్మవ్ ఎమ్మెల్యేగా గెలిచిన కుల్‌‌దీప్ సింగ్ సెంగార్.. రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. 2019లో కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది.  ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. తాజాగా ‘లడ్‌‌కీ హూ.. లడ్‌‌ సక్తీ హూ(అమ్మాయిని.. కొట్లాడగలను)’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రియాంక.. వేధింపులు, చిత్రహింసలకు గురైన బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.