- అంశాన్ని ఎజెండాలో చేర్చిన ఆఫీస్ వర్గాలు
- వ్యతిరేకిస్తున్న సింగరేణి యూనియన్లు
- కోల్ మినిస్టర్, సెక్రెటరీకి యూనియన్ల లెటర్లు..
సీఎంపీఎఫ్ ఆఫీసును హైదరాబాద్ తరలించే ప్రయత్నాలను సింగరేణి కార్మిక సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఒకవేళ తరలిస్తే పోరాటాలకు సిద్ధమవుతామని గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్‌తో పాటు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ సంఘాల ప్రతినిధులు మిర్యాల రాజిరెడ్డి, వి.సీతారామయ్య, బి.జనక్ ప్రసాద్, యాదగిరి సత్తయ్య, టి.రాజారెడ్డి, రియాజ్ అహ్మద్ ప్రకటించారు. సీఎంపీఎఫ్ ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని విరమించు కోవాలని, దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని సెంట్రల్ కోల్ మినిస్టర్, సెంట్రల్ కోల్ సెక్రెటరీ, సీఎండీకి లెటర్లు రాశారు.
గోదావరిఖని, వెలుగు: అనేక పోరాటాల ద్వారా హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి తరలివచ్చిన కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) ఆఫీస్‌ను తిరిగి హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2007 నుంచి గోదావరిఖని కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. సింగరేణి పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, సెంటినరీకాలనీ, భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన సుమారు 50 వేల మంది కార్మికులకు వివిధ రకాల సేవలందిస్తోంది. గతంలో ఆఫీస్‌కు అవసరమైన బిల్డింగ్‌లు, ఇతర సౌకర్యాలను సింగరేణే సమకూర్చింది. అయినా సీఎంపీఎఫ్ ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలించాలని ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు నాగ్‌పూర్‌లో సీఎంపీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మీటింగ్ జరగనుండగా...ఆఫీస్ తరలింపు అంశాన్ని ఎజెండాలో చేర్చారు. దీన్ని సింగరేణిలో అన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఆఫీస్ తరలింపును అడ్డుకుంటామని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమని లీడర్లు చెప్తున్నారు.
పోరాటాలతో తరలివచ్చిన ఆఫీస్..
సింగరేణి కార్మికులకు సీఎంపీఎఫ్ అనేక రకాల సేవలు అందిస్తోంది. గతంలో ఇది హైదరాబాద్‌లో ఉండగా.. చిన్న పనికి కూడా కార్మికులు రాజధానికి వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల సమయంతో పాటు డబ్బు వృథా అయ్యేది. కార్మికులతో పాటు సింగరేణి ఆఫీసర్లు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. దీంతో సింగరేణి కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు పోరాటాలు చేయగా.. 2003లో హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి ఆఫీసును తరలించారు. కానీ ఉద్యోగులు, ఆఫీసర్లు సరిగ్గా రాకపోవడం, సామాగ్రిని తరలించకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయేవి. చివరికి ఆఫీస్‌కు తాళం వేసి ఆందోళన చేపట్టడంతో ట్రస్టీ బోర్డు నిర్ణయం మేరకు 2007లో సింగరేణి ఖర్చులతో పూర్తి స్థాయిలో ఆఫీస్‌ను ఆధునికీకరించారు. ఉద్యోగుల కోసం క్వార్టర్లు కూడా కేటాయించారు.
మళ్లీ తరలించే యత్నం..
గోదావరిఖనిలో సీఎంపీఎఫ్ ఆఫీస్ ఉన్నా అందులో పనిచేసే వారి ధ్యాసంతా హైదరాబాద్‌లోనే ఉంటుంది. అందుకే సీఎంపీఎఫ్ ఆఫీస్ ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న 32 వేల మంది కార్మికులు, మరో 18 వేల మంది రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన ఇబ్బందులను పక్కన పెట్టి కేవలం 80 మంది కోసం సీఎంపీఎఫ్ ఆఫీస్‌ను గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు తరలించాలని యత్నిస్తున్నారు. నేడు నాగ్‌పూర్‌లో జరగనున్న సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు మీటింగ్‌లో ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చారు. ఒకవేళ సీఎంపీఎఫ్ ఆఫీస్ మళ్లీ హైదరాబాద్‌కు తరలిస్తే.. తాము చాలా అవస్థలు పడాల్సి వస్తోందని రామగుండం, బెల్లంపల్లి, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, ఆఫీసర్లు వాపోతున్నారు.
