వరద నీళ్లలో పడవ షాప్

వరద నీళ్లలో పడవ షాప్

వారం రోజుల కిందట కురిసిన పెద్ద వానలకు అస్సాంలో చాలా ప్రాంతాల్లోని కాలనీలు, వీధులు నీటమునిగాయి. చాలా ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. వరద ప్రభావంతో గల్లీల్లోని చిన్న  దుకాణాలు కూడా మూతపడ్డాయి. వారం రోజులుగా ఏ ఒక్క దుకాణం తెరుచుకోవడం లేదు. దాంతో, చిరువ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతికేదెలా? అని ఆలోచించాడు ఒక చిరు  వ్యాపారి. వర్షాలు, వరదల వల్ల అతనికి ఇల్లు గడవడం కష్టమైంది. దాంతో, ఇల్లు దాటలేని పరిస్థితిలో ఉన్న కస్టమర్ల దగ్గరికి తానే వెళ్లాలనుకున్నాడు. అందుకోసం ఒక ఉపాయం ఆలోచించాడు. వరద నీళ్లలో  ‘ఫ్లోటింగ్ షాప్’ నడపడం మొదలుపెట్టాడు. వెరైటీగా ఆలోచించిన ఇతని పేరు ధనేశ్వర్ దాస్.  

అరటి బోదెలతో..
వరద నీళ్లలో ఇంటింటికీ తిరుగుతూ వస్తువులు అమ్మాలంటే పడవ కావాలి. కానీ, అప్పటికప్పుడు పడవ కొనేందుకు కావాల్సిన డబ్బులు ధనేశ్వర్​ దగ్గర లేవు. దాంతో, తేలికగా ఉండి నీటిమీద తేలియాడే అరటి బోదెలనే పడవ లాగా వాడాలి అనుకున్నాడు. ఐదు అరటి బోదెలను వరుసగా పేర్చి కట్టాడు. 
ఎండ తగలకుండా, వానలో తడవకుండా ఉండేందుకు పెద్ద ప్లాస్టిక్ గొడుగు ఏర్పాటు చేసుకున్నాడు. పొడవైన వెదురు కర్రని తెడ్డులా వాడుతున్నాడు. ఆ అరటి బోదెల మీదనే చిన్న ప్లాస్టిక్ టేబుల్... ఆ టేబుల్ మీద వాటర్​ బాటిల్, క్యాండిళ్లు, తమలపాకులు పెట్టుకుని నీట మునిగిన గౌహతి వీధులు, కాలనీల్లో అమ్ముతున్నాడు ధనేశ్వర్. 

షాపు తీస్తేనే ఇల్లు గడిచేది
‘‘షాపు తెరిస్తేనే కొన్ని డబ్బులు వస్తాయి. వరద కారణంగా వారం రోజులుగా షాపు తీయకపోవడంతో ఇంటి ఖర్చులకు చాలా ఇబ్బంది అయింది. దాంతో నీళ్లలో తిరుగుతూ అయినా వస్తువులు అమ్మాలనుకున్నా. అందుకోసం అరటి బోదెల్ని పడవ లెక్క వాడడం మొదలుపెట్టాను” అని చెప్పాడు ధనేశ్వర్.