
- లోయర్ మానేరు డ్యామ్ లో నిరుపయోగంగా బోట్
- జెట్టీ నిర్మించకపోవడంతో ఉపయోగించలేని దుస్థితి
- మిగతా బోట్లకూ రిపేర్లు.. పట్టించుకోని టూరిజం ఆఫీసర్లు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో టూరిస్టుల విహారం కోసం గత సర్కార్ హయాంలో రూ.కోటిన్నర పెట్టి కొనుగోలు చేసిన పార్టీ బోటు నిరుపయోగంగా మారింది. ఏళ్ల తరబడి ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో చివరికి అది పాడైపోయే స్థితికి చేరింది. నాలుగేళ్ల క్రితం తీసుకొచ్చిన రెండు జెట్ స్కీ బోట్లను కొన్నాళ్లు వాడి పక్కన పడేశారు. ఆ బోట్ల సీట్ కవర్లు చిరిగిపోయి కింద తుప్పు పడుతున్నాయి. ప్రస్తుతం రెండు బోట్లు మాత్రమే పని
చేస్తున్నాయి.
జెట్టీ లేక బోట్ నిరుపయోగం..
2018లో రూ.కోటిన్నర వ్యయంతో కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ పార్టీ బోట్ ను లోయర్ మానేరు డ్యామ్ లోకి లంగర్ వేశారు. అందులోకి వెళ్లాలంటే ఒడ్డున జెట్టీ నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.25 లక్షల వరకు ఖర్చు కానుంది. కొంత మేర పనులు ప్రారంభించిన ఆఫీసర్లు.. ఆ తర్వాత పక్కన పెట్టేశారు. దీంతో ఆ బోట్ వినియోగంలో లేకుండా పోయింది. ఈ బోటు అందుబాటులోకి వస్తే హుస్సేన్ సాగర్ లో మాదిరిగా లోయర్ మానేరు డ్యామ్ నీటి మధ్య ఫ్యామిలీ పార్టీలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బోటు 120 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో 40 సీట్లు, డైనింగ్ హాల్‌తో పాటు, ఫస్ట్ ఫ్లోర్ లో 80 మంది
కూర్చునే వీలుంది.
నిరుపయోగంగా జెట్ స్కీ బోట్లు..
నీటిపై బైక్ పై నడిపిన అనుభూతిని ఇచ్చే జెట్ స్కీ బోట్లు ఇప్పుడు పని చేయడం లేదు. దీంతో బోటింగ్ ద్వారా టూరిజం డిపార్ట్ మెంట్ కు వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం రాకుండ పోతుంది. ఈ బోట్లను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో గతంలో కొనుగోలు చేశారు. ఇటీవల టూరిజం డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు వీటిని రిపేర్ నిమిత్తం హైదరాబాద్ తరలించేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. వీటిని ఇక్కడే రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది.
అందుబాటులోకి తీసుకురావాలి
కరీంనగర్ కు రోజూ చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. లోయర్ మానేరు డ్యామ్ చూడడానికి వచ్చే వారికి బోటింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది. త్వరగా జెట్టీ నిర్మించి పార్టీ బోట్ ను వినియోగంలోకి తీసుకురావాలి. ఏ వస్తువైనా వాడకుండ వదిలేస్తే తుప్పుపట్టి పనికి రాకుండా పోతుంది. అందువల్ల అన్ని బోట్లకు రెగ్యులర్ గా సర్వీసింగ్ చేస్తూ వినియోగంలోకి తీసుకురావాలి.
రాజిరెడ్డి, జలవిహార్ అసోసియేషన్