
- బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో
కోటగిరి, వెలుగు : ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తెలిపారు. గతంలో సిర్పూర్ వద్ద పోతంగల్ శివారులో ఏర్పాటు చేసిన రెవెన్యూ చెక్‌పోస్టును దుండగులు నిప్పంటించి కాల్చివేయడంతో అక్కడ రేకుల షెడ్డుతో నిర్మించిన చెక్ పోస్ట్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ చెక్ పోస్ట్‌ను దుండగులు కాల్చివేసిన తర్వాత రేకుల షెడ్డుతో మళ్లీ నిర్మించామని, త్వరలో ఈ చెక్‌పోస్టును ప్రారంభించి ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడతామని తెలిపారు.
అనంతరం పోతంగల్ నుంచి నడుస్తున్న ఇసుక ట్రాక్టర్ల వే బిల్లులను పరిశీలించారు. పోతంగల్ మంజీరా బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను పరిశీలించి ప్రతీ ట్రాక్టర్ కు వే బిల్లును కచ్చితంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పోతంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు.కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ గంగాధర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.