జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై ఎటూ తేల్చని పోలీసులు

జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై ఎటూ తేల్చని పోలీసులు

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. నిన్న రాత్రి 8గంటల 40నిమిషాలకు ప్రమాదం జరిగితే.. ఇప్పటివరకు నిందితులను గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యులే కారు నడిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ తో పాటు మరొకరు కారులో ఉన్నారంటున్నారు బాధితులు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి.. డ్రైవర్, మరొకరు వ్యక్తి పారిపోయారు. పారిపోయినవారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అయితే ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు చెప్తుండటం విమర్శలు దారి తీస్తోంది. 

మరోవైపు కారు మొత్తం బ్లాక్ గ్లాస్ ఉండటంతో గుర్తించలేకపోతున్నామంటున్నారు పోలీసులు. సామాన్యులు తమ కార్లకు బ్లాక్ గ్లాస్ పెట్టుకుంటే వెంటనే యాక్షన్ తీసుకునే పోలీసులు.. అధికార పార్టీ ఎమ్మెల్యే కారుకు బ్లాక్ గ్లాస్ పెట్టుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. యాక్సిడెంట్ చేసిన కారుకు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ.. TR నెంబర్ తో తిరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన జీప్ పై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో ఇన్ని ఆధారాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా.. ఇప్పటివరకు పోలీసులు ఏమీ తేల్చకపోవడం చర్చనీయాంశం అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కారు అవ్వడం వల్లే యాక్షన్ తీసుకోవడం లేదని.. నిందితులను పట్టుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.