
పద్మారావునగర్, వెలుగు: ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌ను అధికారులు ఆదివారం సీజ్ చేశారు. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. ఆ స్కూల్ విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జయప్రకాశ్ గౌడ్ ఓల్డ్ బోయిన్పల్లి సాయికాలనీలో నివాసం ఉంటూ.. మేధా పేరుతో స్కూల్ నిర్వహిస్తున్నాడు.
ఎక్కువ సంపాదించాలనే దురాశతో స్కూల్లోనే ఆల్ఫ్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. సమాచారం అందుకున్న ఈగల్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు చేసింది. జయప్రకాశ్ గౌడ్‌తోపాటు అతనికి సహకరించిన బోయిన్‌పల్లికి చెందిన ఉదయ్ సాయి, మురళిను అదుపులోకి తీసుకొన్నారు. ఈ దందాలో ఇంకా ఎవరైన ఉన్నారా...అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.