గుండు కొట్టించారని యువకుడి సూసైడ్​ అటెంప్ట్​

గుండు కొట్టించారని  యువకుడి సూసైడ్​ అటెంప్ట్​

మహబూబ్ నగర్, వెలుగు: బర్రెలు దొంగతనం చేశారంటూ గుండు కొట్టించడంతో యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం మహబూబ్​నగర్​జిల్లాలో కలకలం సృష్టించింది. మహబూబ్‍నగర్‍ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన మహేశ్వర్‍రెడ్డి బుధవారం ఒక బర్రె, దూడను దేవరకద్ర సంతలో అమ్మడానికి స్నేహితుడైన రాఘవేందర్‍ను తీసుకెళ్లాడు. రూ. 30 వేలకు వాటిని అమ్మిన మహేశ్వర్‍రెడ్డి ఆ డబ్బుతో హైదరాబాద్‍కు వెళ్లిపోయాడు. గ్రామ సర్పంచి హర్షవర్దన్​రెడ్డికి మహేశ్వర్​రెడ్డి మేనల్లుడవుతాడు. మహేశ్వర్​రెడ్డి బర్రెలు అమ్మి డబ్బు తీసుకురాకపోవడంతో తండ్రి విషయాన్ని సర్పంచి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సర్పంచి మరుసటి రోజు  రాఘవేందర్​ను ఇంటికి పిలిపించి బర్రెల విషయం ఆరా తీశారు. శుక్రవారం సర్పంచ్‍ ఇద్దరిని గ్రామ పంచాయతీకి పిలిపించి అందరిముందు గుండు కొట్టించారు. ఇందులో తన తప్పేం లేదని, అయినా గుండు కొట్టించారని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాఘవేందర్‍ సూసైడ్‍ నోట్‍ రాసి వాట్సప్‍లో పోస్టు చేశాడు. గ్రామ సమీపంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్‍ను ముట్టుకోవడానికి ప్రయత్నించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న భూత్పూర్‍ పోలీసులు అతడిని అదుపులో తీసుకుని కౌన్సిలింగ్‍ ఇచ్చారు. తనను అవమానించిన సర్పంచ్‍పై చర్య తీసుకోవాలని రాఘవేందర్‍  ఫిర్యాదు చేశారు.