గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా.. బంజరాహిల్స్కు చెందిన మహిళ అరెస్టు

గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా.. బంజరాహిల్స్కు చెందిన మహిళ అరెస్టు

వెకేషన్ కోసం, హలీడే ట్రిప్ కోసం చాలా మంది గోవా వెళ్తుంటారు. అందరి మాదిరిగానే గోవా వెళ్లింది హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ. కానీ అందిరిలా ట్రిప్ ఎంజాయ్ చేసి రాలేదు. డ్రగ్స్ పెడ్లర్స్ తో పరిచయాలు పెంచుకుని దందాలోకి దిగింది. గుట్టుచప్పుడు కాకుండా గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించింది. తప్పు చేసిన వాళ్లు ఏదో ఒకరోజు పట్టుబడాల్సిందే కదా. న్యూ ఇయర్  కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.  

గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలును అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితురాలిని బంజారాహిల్స్‌కు చెందిన హస్సాగా గుర్తించారు. గోవా నుంచి MDMA,LSD సరఫరా చేసినట్లు గుర్తించారు పోలీసులు. నైజీరియన్ సరఫరాదారుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

హస్సా  2024 డిసెంబరులో గోవా పర్యటనలో భాగంగా.. డ్రగ్స్ పెడ్లర్స్ తో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాగేటర్ క్లబ్‌లో MDMA వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు చెప్పారు. 2025 మార్చి నుంచి పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హస్సా డిసెంబర్ 26న సియోలిమ్, మాపూసాలో MDMA, LSD అందజేసినట్లు తేలింది.

హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో కలిసి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ పోలీస్ స్టేషన్లో NDPS కేసులో గతంలో అరెస్ట్ అయినట్లు చెప్పారు. అయితే ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన నిందితురాలు.. మళ్లీ డ్రగ్స్ కేసులో దొరకటంతో అరెస్టు చేశారు పోలీసులు.