నల్లమల ఘాట్ రోడ్డులో బొలెరో బోల్తా..

నల్లమల ఘాట్ రోడ్డులో బొలెరో బోల్తా..
  • 20 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
  • బాధితులు కర్నాటకలోని బళ్లారి జిల్లా వాసులు

కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలోని నంద్యాల-గిద్దలూరు ఘాట్ రోడ్డులో తృటితో ఘోర ప్రమాదం తప్పిపోయింది. కన్నడ భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడగా... అందులో ఉన్న 20 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రీశైలం నుంచి మహానంది వస్తుండగా గిద్దలూరు ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాధితులంతా కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా వాసులుగా గుర్తించారు. ఉగాది పండుగ సందర్భంగా తమ ఆడపడచు అయిన శ్రీశైల భ్రమరాంబ దేవి అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకోవడం కన్నడ, మహారాష్ట్ర భక్తుల ఆనవాయితీ. ఇదే కోవలో వారు ఏటా ఉగాది సందర్భంగా శ్రీశైలాన్ని సందర్శించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈసారి  కరోనా సెకండ్ వేవ్ ఉండడంతో పండుగకు ముందే వారు శ్రీశైలాన్ని దర్శించుకుని.. తిరుగు ప్రయాణంలో మహానందీశ్వరుడి దర్శనం కోసం బయలుదేరారు. మరో గంటలో మహానంది చేరుకునే సమయంలో వారు గిద్దలూరు ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.