బొల్లారంలో అవిశ్వాస గండం

బొల్లారంలో అవిశ్వాస గండం
  • బీఆర్ఎస్ చైర్ పర్సన్ ను దించేందుకు అసమ్మతి వర్గం రెడీ
  • చేజారుతున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు
  • పదవి కాపాడుకునేందుకు  చైర్ పర్సన్ భర్త బాల్ రెడ్డి 
  •  ఉన్న కౌన్సిలర్లతో గోవా ట్రిప్
  • బొల్లారం మున్సిపాలిటీలో  హీటెక్కిన రాజకీయాలు

సంగారెడ్డి/జిన్నారం, వెలుగు: బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ రోజారాణికి పదవి గండం సమస్య ఏర్పడింది. పదవి కాపాడడం కోసం చైర్ పర్సన్ భర్త బాల్ రెడ్డి తమతో ఉన్న కౌన్సిలర్లతో గోవా ట్రిప్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ రోజా రాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అసమ్మతి నేతలతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. చైర్ పర్సన్ వర్గానికి చెందిన ఓ కౌన్సిలర్ ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం.. తన భర్త కనిపించడం లేదని అతడి భార్య ఈనెల 21న జిన్నారం పీఎస్​లో ఫిర్యాదు చేయడంతో బొల్లారం మున్సిపాలిటీలో రాజకీయాలు ఒకసారిగా హీటెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతోంది.
 
మ్యాజిక్ ఫిగర్ 11

బొల్లారం మున్సిపాలిటీలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ 17, కాంగ్రెస్ 2, బీజేపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. 22 మంది కౌన్సిలర్లలో 11 మంది కౌన్సిలర్ల బలం ఉంటే అవిశ్వాసం నెగ్గడానికి సరిపోతుంది. అయితే ఏడాది కింద బీఆర్ఎస్ కు చెందిన 11వ వార్డు కౌన్సిలర్ ప్రమీల సూసైడ్ చేసుకోగా ప్రస్తుతం 21 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఇటీవల ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా, మరో ఇద్దరు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

 కాంగ్రెస్ 8 మంది, అదృశ్యమైన ఒకరు, టచ్ లో ఉన్న ఇద్దరూ కలిపి మొత్తం 11 మంది మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఇద్దరు బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై ఎప్పుడు అవిశ్వాసం పెడితే అప్పుడు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు కాంగ్రెస్ కౌన్సిలర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే తమ పదవికి ప్రమాదమని భావించిన సదరు చైర్ పర్సన్ భర్త బాల్ రెడ్డి సొంత పార్టీ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ప్రస్తుతం వారితో గోవా ట్రిప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

హరీశ్ రావు దిశా నిర్దేశంలో..

కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్ వర్గం మాజీ మంత్రి హరీశ్ రావు దిశా నిర్దేశంలో పనిచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం హరీశ్ రావును కలిసి బొల్లారంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి వివరించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ అదృశ్యం అవడం.. ఇద్దరు ముగ్గురు సొంత పార్టీ కౌన్సిలర్ల వ్యవహార తీరు తోపాటు రాజకీయ సమీకరణాల గురించి మాజీ మంత్రితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారన్న టాక్ వినిపిస్తోంది.

 ఈ క్రమంలోనే ఉన్న కొద్ది మంది కౌన్సిలర్లతో బాల్ రెడ్డి క్యాంపునకు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ రోజా రాణిపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వ్యూహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.