బాలీవుడ్ లో విషాదం.. కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ లో విషాదం.. కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ సరోజ్ ఖాన్(71) గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ముంబయిలోని గురునానక్  హాస్పిటల్ లో చనిపోయారు. సరోజ్ ఖాన్  శ్వాసకోస సమస్యతో జూన్ 20న గురునానక్ హాస్పిటల్ లో చేరారు. ఆమెకు కరోనా సోకిందనే భయంతో టెస్టులు చేయగా నెగటివ్ వచ్చింది. సరోజ్ ఖాన్‌కు భర్త  సోహన్‌లాల్, కుమారుడు హమీద్ ఖాన్, కుమార్తెలు హినా ఖాన్, సుకినా ఖాన్ ఉన్నారు.

మూడేళ్ళ వయసులో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా సరోజ్ ఖాన్, 1974 లో గీతా మేరా నామ్‌తో  కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె కెరీర్‌లో 2000 పాటలకు పైగా కొరియోగ్రఫీ చేశారు. మూడుసార్లు జాతీయ అవార్డు పొందారు. మిస్టర్ ఇండియా నుండి హవా హవాయి (1987), తేజాబ్ (1988) నుండి ఏక్ దో టీన్, బీటా నుండి ధాక్ ధక్ కర్నే లగా (1992) , దేవదాస్ (2002) నుండి డోలా రే డోలా సాంగ్స్ కు ఆమె కొరియో గ్రఫీ చేశారు.  చివరిసారిగా 2019 లో కరణ్ జోహార్ నిర్మించిన కలాంక్ నుండి తబా హో గయే పాటలో మాధురి దీక్షిత్ కు  సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు.