బాలీవుడ్ సీనియర్ నటుడు, సినీ పరిశ్రమకు నిజమైన హీమ్యాన్ గా పేరుగాంచిన ధర్మేంద్ర కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలతో ఆయన చివరి తుదిశ్వాస విడిచారు. ఎంతోకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ లెజెండరీ నటుడి మరణం దేశవ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆయన మృతిపై ప్రధాని మోడీ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
60 ఏళ్ల సినీ ప్రస్థానంలో సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర, తన కష్టపడి పనిచేసే నైపుణ్యంతో, ప్రజాదరణతో కోట్లాది అభిమానుల మనసును గెలుచుకున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.450 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. నటనలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ ఆయన ప్రతిభ కలిగి ఉన్నారు.
ధర్మేంద్ర స్థాపించిన థీమ్ రెస్టారెంట్ Garam Dharam, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇప్పటికీ భారీ ప్రజాదరణ పొందుతోంది. కర్నాల్ హైవేపై ఉన్న ప్రత్యేక He-Man థీమ్ రెస్టారెంట్ కూడా ప్రముఖ పర్యాటక ఆకర్షణగా కొనసాగుతోంది. ఇవి కాకుండా.. లోనావాలా సమీపంలోని ఖండాలలో ఆయనకు 100 ఎకరాల లగ్జరీ ఫార్మ్‌హౌస్ కూడా ఉంది. దాదాపు రూ.120 కోట్ల విలువైన ఈ ఫార్మ్‌హౌస్‌లో విస్తారమైన స్విమ్మింగ్ పూల్, ఆర్గానిక్ వ్యవసాయం, ఆక్వాథెరపీ సెంటర్ వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి. ఆయన తరచూ తన ఫార్మ్‌హౌస్‌లో సమయం గడిపి, అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు.
విలాసవంతమైన కార్లంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన కార్ కలెక్షన్ లో Mercedes-Benz S-Class, Mercedes-Benz SL500, Range Rover లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ఆయనకు చాలా ఇష్టమైనది మాత్రం 65 ఏళ్ల పాత Fiat కారే. దానిని ఎంతో మమకారంగా చూసుకునేవారు. మహారాష్ట్రలోని రియల్ ఎస్టేట్, హెల్త్, హాస్పిటాలిటీ, వ్యవసాయ రంగాల్లో కూడా ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి.
Ekkis అనే ఆయన చివరి చిత్రం వచ్చే నెల విడుదల కావాల్సి ఉంది. అభిమానులు ఆ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తెరమీద కనిపించనున్న ఆయన ఇక లేడనే వాస్తవం సినీ లోకాన్ని కుదిపేస్తోంది.
