పాక్‎లో బాంబు పేలుడు.. ఏడుగురు పోలీసుల మృతి

పాక్‎లో బాంబు పేలుడు..  ఏడుగురు పోలీసుల మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‎లో టెర్రరిస్టులు దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని పేల్చడంతో ఏడుగురు చనిపోయారు. సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‎లో ఈ దారుణం జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉగ్రవాదులు బుధవారం రిలీజ్ చేశారు. రోజువారీ విధుల్లో భాగంగా సోమవారం ట్యాంక్ జిల్లాలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ వెహికల్‎ను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్–ఇ– తాలిబాన్ (టీటీపీ)కు అనుబంధంగా ఉన్న ప్రత్యేక విభాగం సభ్యులు రిమోట్ కంట్రోల్‎తో ఐఈడీని పేల్చారు. 

దీంతో వెహికల్ తునాతునకలైంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తర్వాత రోడ్డుపై పడి ఉన్న పోలీసులపై టీటీపీ సభ్యులు కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనపై పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఐదుగురు అధికారులు స్పాట్‎లోనే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు. మృతుల్లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్, సబ్ ఇన్ స్పెక్టర్, ఎలైట్ ఫోర్స్ సిబ్బంది, డ్రైవర్ ఉన్నారని చెప్పారు. 

బలూచిస్తాన్​ లో నలుగురు టెర్రరిస్టులు హతం

పాక్ బలగాలు జరిపిన ఆపరేషన్‎లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. సోమవారం బలూచిస్తాన్ ప్రావిన్స్‎లో కలత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు బుధవారం సైన్యం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో టెర్రరిస్టుల స్థావరాలపై భద్రతా దళాలు దాడి చేశాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని సైన్యం తెలిపింది.