పది నిమిషాల్లో బాంబు పేలుస్తా: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు అమెరికా నుంచి బాంబు బెదిరింపు

పది నిమిషాల్లో బాంబు పేలుస్తా: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు అమెరికా నుంచి బాంబు బెదిరింపు

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. మంగళవారం (డిసెంబర్ 9) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి విమానాశ్రయ అధికారులకు మెయిల్ వచ్చింది. బాంబు పేలకూడదు అంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

లేదంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తామంటూ హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్ట్‎లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, బాంబు స్వ్కాడ్ రంగంలోకి దిగి శంషాబాద్ ఎయిర్ పోర్టును అణువణువు గాలించారు. శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో సోదాలు చేశారు. 

మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబ్ ఉందంటూ మెయిల్ పంపినట్లుగా నిర్ధారించారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది.