శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపు

హైదరాబాద్: ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడుతుండగా మరోవైపు విమానాలకు వరుస బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. 

కేరళలోని కన్నూర్‌ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్‌ఫర్ట్‌-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పైలట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో విమానాలను సేఫ్ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను కిందికి దింపి ఐసోలేషన్‎కు తరలించారు అధికారులు. అనంతరం మూడు విమానాలను ప్రత్యేక బేలకు తరలించి బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు సెక్యూరిటీ అధికారులు.

 ఫ్లైట్ సహా ప్రయాణికులు, వారి దగ్గరున్న లగేజీ, కార్గోలను బాంబ్, డాగ్ స్క్వాడ్‌‌ బృందాలు తనిఖీ చేశాయి. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. బాంబ్ ఉందంటూ మెయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపుతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు చివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.