డెలివరీ కోసం గర్భిణీకి బెయిల్..​ తల్లీ, బిడ్డపై ప్రభావం పడ్తదన్న బాంబే హైకోర్టు

డెలివరీ కోసం గర్భిణీకి బెయిల్..​ తల్లీ, బిడ్డపై ప్రభావం పడ్తదన్న బాంబే హైకోర్టు

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఓ గర్భిణికి.. బాంబే హైకోర్టులోని నాగ్​పూర్ బెంచ్ ఆరు నెలల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జైలు వాతావరణంలో నిందితురాలు సురభి సోని డెలివరీ కావడం ఆమెతో పాటు బిడ్డకు ఏమాత్రం మంచిది కాదని సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ ఉర్మిళ జోషి అభిప్రాయపడ్డారు. జైల్లో డెలివరీ అయితే.. ఇద్దరిపై ప్రభావం పడ్తదని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్​లో సురభి సోనిని ఎన్​డీపీఎస్ యాక్ట్ కింద రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. 

అప్పటినుంచి ఆమె విచారణ ఖైదీగా జైల్లోనే ఉన్నది. కాగా, గోండియా రైల్వే సెక్యూరిటీ ఫోర్స్.. ట్రైన్​లో చెకింగ్ చేస్తున్నప్పుడు ఐదుగురి వద్ద నుంచి 33 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారిలో సురభి సోని కూడా ఒకరు. అరెస్ట్ చేసే టైమ్​లో ఆమె 2 నెలల ప్రెగ్నెంట్. తన డెలివరీ జైలు బయట చేయాలని, మానవతాదృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఆమె విజ్ఞప్తిని ప్రాసిక్యూషన్ తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న నాగ్​పూర్ బెంచ్‌‌.. సోనికి 6  నెలలు బెయిల్‌‌ మంజూరు చేసింది.