రేప్ కేసులో దోషులపై బాంబే హైకోర్టు సంచలన కామెంట్స్

V6 Velugu Posted on Nov 26, 2021

  • వాళ్లు ‘చస్తూ’ బతకాలె
  • ముంబై శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో దోషులపై బాంబే హైకోర్టు కామెంట్స్
  • ముగ్గురు దోషులకు మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ తీర్పు 
  • ప్రజల ఆగ్రహాన్ని బట్టి ఎమోషనల్ గా తీర్పులివ్వలేమని వెల్లడి  

ముంబై: ఎనిమిదేండ్ల క్రితం ముంబైలోని శక్తి మిల్స్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కు సంబంధించిన కేసులో ముగ్గురు దోషులకు సెషన్స్ కోర్టు వేసిన మరణ శిక్షను బాంబే హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. దోషులు జీవితాంతం చస్తూ బతకాలని, చేసిన నేరానికి పశ్చాత్తాపపడుతూ గడపడమే సరైన శిక్ష అని ఈ మేరకు జడ్జిలు జస్టిస్ సాధనా జాదవ్, పృథ్వీరాజ్ చవాన్ లతో కూడిన బెంచ్ గురువారం తీర్పు ఇచ్చింది. ‘‘జరిగిన దారుణం అత్యంత ఆటవికం, దారుణం. అది సమాజపు ఆత్మనే కలచివేసింది. రేప్ అంటే జీవించే హక్కుపై ఓ మాయని మచ్చ. బాధితురాలు శారీరకంగానే గాక మానసికంగా కూడా నరకం చూస్తుంది. కాదనలేం. కానీ అంతమాత్రాన ప్రజల ఆగ్రహాన్ని బట్టి ఎమోషనల్ గా తీర్పులివ్వలేం. చట్టప్రకారం మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. మరణశిక్ష అత్యంత అరుదుగా విధించాల్సిన శిక్ష. ప్రాణాలు తీస్తే ఇక పశ్చాత్తాపానికి చాన్సెక్కడ? పైగా మహిళను కేవలం కోర్కెలు తీర్చుకునే వస్తువుగా చూసే ఇలాంటివాళ్లకు సమాజంలో కలిసే హక్కే లేదు. వీళ్లు క్షమాపణకూ ఏమాత్రం అర్హులు కారు. కాబట్టి అత్యంత కఠిన జైలుశిక్షే సరైనదని మా ఉద్దేశం. వీళ్లకు పెరోల్ కు కూడా వీలు లేని జీవిత ఖైదు విధిస్తున్నాం. వాళ్లిక సమాజంతో ఎన్నటికీ కలవలేరు. చేసిన పాపాలకు కుమిలిపోతూ జీవితమంతా జైల్లోనే గడుపుతారు” అని పేర్కొంది. ఏ సమాజానికైనా మహిళలే వెన్నెముక అని, వారిని గౌరవించేదే మంచి సమాజం అవుతుందని బెంచ్ గుర్తు చేసింది. 

ఏం జరిగింది?
2013లో తోటి ఉద్యోగితో కలిసి ఫొటో షూట్ కోసం ముంబైలోని పాడుబడ్డ శక్తి మిల్స్ కు వెళ్లిన 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టును ఐదుగురు దారుణంగా రేప్ చేశారు. వారిలో మైనర్ అయిన ఆకాశ్ జాదవ్ ను జువనైల్ హోంకు పంపి కొన్నేళ్ల తర్వాత వదిలేశారు. బయటికొచ్చాక సొంత గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. తర్వాత ఓ 19 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్ కూడా ఈ గ్యాంగ్ తనను అదే శక్తి మిల్స్​లో రేప్ చేసిందని కేసు పెట్టింది. 2 కేసుల్లో ఇద్దరు మైనర్లతో పాటు ఏడుగురిని ఆగస్టులో అరెస్టు చేశారు. వారిలో ఆకాశ్, కాసీం బెంగాలీ, మహ్మద్ సలీం అన్సారీ 2కేసుల్లోనూ నిందితులు. గ్యాంగ్ రేప్ తదితర సెక్షన్ల కింద సెషన్స్ కోర్టు 2014లో వీరికి మరణశిక్ష విధించింది. ఉరి శిక్షను జీవితఖైదుగా మారుస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

Tagged high court, GANG RAPE, rape case, Bombay, shakthi mills

Latest Videos

Subscribe Now

More News