పంటలకు బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది?

పంటలకు బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది?

రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలకు చట్టబద్ధత లేదు. కనుక, హామీలను దండిగా ఇవ్వడం అన్ని పార్టీలకు ఆనవాయితీగా మారిపోయింది. వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లింపు విషయంలో  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కూడా అన్ని కోణాలలో  ఆలోచించి ఇచ్చిన  హామీ కాదు. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉండే పరిమితులు, వరి విస్తీర్ణం పెరిగితే వచ్చే పర్యావరణ సంక్షోభం దృష్ట్యా ఈ హామీ ఇచ్చే ముందు ఇంకా లోతుగా చర్చించి ఉండాల్సింది.

రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్షంలోకి రాగానే అవే విధానాలపై పూర్తి భిన్నమైన వైఖరితో మాట్లాడడం చూస్తున్నాం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం, రాజకీయ ప్రయోజనం పొందడం తప్ప, నిజమైన ప్రజల సమస్యల పరిష్కారం ప్రతిపక్షాల దృష్టిలో లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరి దీనినే స్పష్టం చేస్తున్నది. వారి డిమాండ్లలో, ఉద్యమాలలో నిజాయితీ లేదు. చిత్తశుద్ధి లేదు.  తెలంగాణలో వరి చుట్టూ ఉన్న అంశాల్ని పరిశీలిద్దాం...

రైతులు  ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు వాళ్ళు ధర నిర్ణయించలేరు. మార్కెట్​లో  స్వయంగా అమ్ముకోలేరు. ఈ స్థితిని  ఆసరా చేసుకుని వ్యాపారులు, దళారీలు, రిటైల్ కంపెనీలు రైతుల ఉత్పత్తులకు అతి తక్కువ ధరలు చెల్లించి దోచుకుంటున్నాయి. అందుకే రైతుల ఆదాయాలు మెరుగుపడాలంటే, రైతుల ఉత్పత్తులకు సరైన ధరలు అందాలంటే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి.  ఈ  డిమాండ్​తో జరిగిన అనేక రైతు ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా రైతులు పండించే 23  పంటలకైనా  కనీస మద్దతు ధరలను  ప్రకటిస్తున్నది. ప్రభుత్వ రంగంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసింది.

ఆహార భద్రతా  చట్టం క్రింద ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ప్రతి సంవత్సరం బియ్యం, గోధుమల వంటి కొన్ని పంటలను  సేకరిస్తున్నది. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ ఇందుకు ఒక సూత్రాన్ని ప్రతిపాదించింది. రైతు చేసే సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా కలిపి కనీస మద్ధతు ధరగా నిర్ణయించాలని  సిఫారసు చేసింది.  ఈ సిఫారసును తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని 2014లో బీజేపీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో  ప్రకటించింది. కానీ, గత పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ  సిఫారసును అమలు చేయలేదు.

కనీస మద్ధతు ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలి? 

స్వామినాథన్ కమిషన్  సిఫారసు ప్రకారం కాకుండా తప్పుడు సూత్రం ఆధారంగా ధరలను ప్రకటించడం వల్ల, దేశంలో రైతులు ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్లు నష్టపోతున్నారు. తెలంగాణ రైతులు గత పదేండ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.  ప్రతి రైతూ ప్రతి సీజన్​లో ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఉదాహరణకు 2023–-24 సంవత్సరానికి స్వామినాథన్ కమిషన్  సిఫారసు ప్రకారం క్వింటాలు వరి ధాన్యానికి రూ.2886.50 ధర ప్రకటించాలి. కానీ సాధారణ వరి ధాన్యానికి రూ.2186, A గ్రేడ్ ధాన్యానికి రూ. 2203  ధర ప్రకటించారు. అంటే ప్రతి క్వింటాలు ధాన్యానికి  కనీసం రూ.663.50  తక్కువ అన్నమాట.

ఎకరానికి 25 క్వింటాళ్లు పండుతాయనుకుంటే రైతుకు ఎకరానికి రూ.16,587   నికర నష్టం అన్నమాట. రేవంత్ సర్కార్ అన్ని వడ్లకు కాకుండా, కేవలం సన్నాలకే రూ.500  బోనస్ ఇచ్చి మోసం చేస్తుందని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమ పార్టీ ఆధ్వర్యంలోని  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గత పదేండ్లుగా మద్ధతు ధరల విషయంలో రైతులకు చేస్తున్న ద్రోహం గురించి ఒక్కమాట మాట్లాడడు. రైతుసంఘాలు అడిగితే జవాబు చెప్పడు. 

పంటలకు బోనస్ ​అనివార్యం

కేంద్రంలో ఉండే ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తే రైతులకు ఏ  నష్టం ఉండదు. కానీ, కేంద్రం అలా బాధ్యత తీసుకోవడం లేదు కనుక, రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు బోనస్ ఇవ్వాలని ఆలోచించడం తప్పు కాదు. అయితే, కేవలం వరికే కాకుండా , రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పంటలు పండించే రైతులు నష్టపోకుండా ఆయా పంటలకు కూడా బోనస్ ప్రకటిస్తే , మిగిలిన రైతులు కూడా నష్టపోకుండా ఉంటారు. అయితే బడ్జెట్ కొంత పెరుగుతుంది. అందుకు బడ్జెట్ సహకరిస్తుందా అన్నది ప్రశ్న.

2024 ఖరీఫ్  సీజన్ నుంచి ఎకరానికి ప్రతి సీజన్ లో  రూ.7,500  రైతు భరోసా సహాయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఈ రైతు భరోసా సహాయం ప్రధానంగా భూ యాజమానులకు ఇస్తున్నారు. వాటిలో వేల కోట్లు వృథా అవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఈ పెట్టుబడి సహాయాన్ని సాగు చేయని రైతులకు కూడా ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి.

నిజంగా సాగు చేసే రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలంటే, రైతు భరోసా కాకుండా, పంట ధరపై బోనస్ రూపంలో చెల్లిస్తే ఎక్కువ ఉపయోగమని , అనేకమంది రైతులు  కూడా భావిస్తున్నారు. ఎక్కువ భాగం రైతు సంఘాల అభిప్రాయం కూడా ఇదే. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న కౌలు రైతులను గుర్తించి  సహాయం చేయడానికి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు కూడా ఒక మేరకు ధర బోనస్ రూపంలో సహాయం చేయడం మార్గాన్ని సులువు చేయవచ్చు. 

చత్తీస్​గఢ్​ వరి బోనస్ కథ

2013---–14 లో అప్పటి బీజేపీ ప్రభుత్వం మొదటిసారి క్వింటాలు వరి ధాన్యానికి రూ.300  బోనస్ ప్రకటించింది. రెండు సంవత్సరాలు అమలు చేసి మానేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఉన్న కనీస మద్ధతు ధరతో సంబంధం లేకుండా క్వింటాలుకు రూ. 2,500  ధర చెల్లిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఐదేండ్లు అమలు చేసింది. ఈ పరిణామంతో 2017-- -–18లో 15,77,332 మంది వరి రైతులు ఉండగా, వారి సంఖ్య 2022- -– 23 నాటికి 25,93,000 మందికి పెరిగిపోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలని పథకం వేసిన బీజేపీ,  2023 డిసెంబర్​లో జరిగిన ఎన్నికలలో కనీస మద్దతు ధరతో సంబంధం  లేకుండా క్వింటాలు వరి ధాన్యానికి రూ.3100 ధర చెల్లిస్తానని ప్రకటించింది. అంటే కనీస మద్ధతు ధర కంటే, క్వింటాలుకు రూ. 917 ఎక్కువ.  చత్తీస్​గఢ్​లో ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. అయితే,  రైతుకు ఎంత పండినా, ఎకరానికి  21  క్వింటాళ్లు  మాత్రమే ఈ  ధరతో  కొంటానని  ప్రభుత్వం రైతుకు  చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతు వ్యాపారులకు అమ్ముకోవాలి. ప్రభుత్వ హామీ ఫలితంగా ఎకరానికి రైతుకు  రూ.19,257 అదనపు ఆదాయం వస్తుంది.

స్వామినాథన్​ సిఫార్సులు అమలుకు కాంగ్రెస్​ హామీ

రైతులు చిరు ధాన్యాలు సహా, అన్ని పంటలూ మానేసి వరి మాత్రమే వేస్తున్నారు. ఫలితంగా పర్యావరణ పరమైన సమస్యలు కూడా ఆ రాష్ట్రంలో ముందుకు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇది ఒక రకంగా ఆ రాష్ట్ర వరి రైతులకు లాభం చేసిన  మాట నిజమే కానీ,  చత్తీస్​గఢ్​లో అమలు చేసిన దానిని దేశమంతా బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో, కనీసం తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఎందుకు అమలు చేయడం లేదో, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ధర చెల్లించాలని అడిగిన రైతులను ఎందుకు కాల్చి చంపిందో  కూడా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాలి. అంటే  ఆ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర బడ్జెట్ పై రూ.13,000 కోట్ల  అదనపు భారం పడినా ( ఇందుకోసం అదనపు అప్పులు చేశారు ) అమలు చేస్తారు. మిగిలిన చోట్ల మౌనంగా ఉంటారు.  ఈసారి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కేరళ వరి బోనస్ కథ 

కేరళ రాష్ట్ర జనాభా మూడు కోట్ల ముప్పై లక్షల మంది . కేరళలో  మొత్తం సాగు భూమి 25.69 లక్షల హెక్టార్లు కాగా, కేవలం 2.02 లక్షల హెక్టార్లలో ( 7.69 శాతం) మాత్రమే వరి సాగు చేస్తున్నారు. 2,50,000 మంది వరి రైతులున్నారు. కేరళ వరి సాగులో కూలీల ఖర్చు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో వరి రైతులు పైనాపిల్ సాగు వైపు మళ్లుతున్నారు.2001-02లో కేరళలో 3.22 లక్షల హెక్టార్లలో వరిసాగు  కాగా, 2021-22 నాటికి అది 1.95 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇదే కాలంలో ధాన్యం  ఉత్పత్తి కూడా  7.0ద్ద3 లక్షల టన్నుల నుంచి 5.62 లక్షల టన్నులకు పడిపోయింది.

అందుకే కేరళ తన బియ్యం అవసరాల కోసం పంజాబ్, తెలంగాణ  సహా, ఇతర రాష్ట్రాలపై ఆధార పడవలసి వస్తున్నది. ఈ ప్రత్యేక  పరిస్థితిని అధిగమించడానికి , కేరళ రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు ఇన్​పుట్ సహాయంగా హెక్టారుకు రూ. 5,500  సహాయం చేస్తున్నది. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. వరి ఉత్పత్తి బోనస్ గా హెక్టారుకు రూ.1000  అదనంగా అందిస్తున్నది. వరి భూములను కాపాడుతున్నందుకు భూ యజమానులకు హెక్టారుకు రూ. 3000  అందిస్తున్నది. స్థానిక గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు ప్రతి వరి రైతుకూ హెక్టారుకు మరో రూ. 25,000  సహాయం అందిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి పెంచడానికి పడుతున్న పాట్లు  అవి. 

-కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక