ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ముషీరాబాద్, వెలుగు: ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఆదివారంతో ముగియనుంది. శనివారం వీకెండ్ కావడంతో సందర్శకులు భారీగా తరలివచ్చారు. కళాభారతిలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్, డాక్టర్ కొండ నాగేశ్వర్ తో కవి నందిని సిధారెడ్డి సంభాషణ జరిగింది. అనంతరం రామోజు హరగోపాల్ రాసిన ‘తెలంగాణ చరిత్ర తొవ్వల్లో’ పుస్తకాన్ని ప్రొఫెసర్ యశ్వంతమూర్తి రిలీజ్ చేశారు. అంతకుముందు స్కూల్ స్టూడెంట్లకు పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు.

3 కమిషనరేట్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లోని 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వైన్స్ షాప్​ల వద్ద రద్దీ కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్​తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌మార్గ్‌‌‌‌, ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌, నెక్లెస్‌‌‌‌రోడ్స్‌‌‌‌, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు  గ్రేటర్​లోని అన్ని ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ ను అనుమతించలేదు. లంగర్ హౌస్, బేగంపేట ఫ్లై ఓవర్లపై ట్రాఫిక్ ను అనుమతించారు. ఓఆర్ఆర్ రూట్​లో ఎయిర్​పోర్టుకు వెళ్లే వారిని మాత్రమే అనుమతించారు. న్యూ ఇయర్  వేడుకల్లో ఎలాంటి  ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 185 స్పెషల్ టీమ్స్‌‌‌‌తో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈవెంట్స్ ఎక్కువగా జరిగిన ఏరియాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వెహికల్ చెకింగ్ చేశారు.  అప్పర్ ట్యాంక్ బండ్​పై అర్ధరాత్రి 12 గంటలకు సిటీ సీపీ ఆనంద్ కేక్ కట్ చేశారు. సిటిజన్లకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. సైబరాబాద్‌‌‌‌లోని టీ–-హబ్ జంక్షన్‌‌‌‌ వద్ద సీపీ స్టీఫెన్‌‌‌‌ రవీంద్ర, ఎల్ బీనగర్ లో రాచకొండ సీపీ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ కేక్‌‌‌‌ కట్‌‌‌‌ చేశారు.

బైరి నరేశ్​పై పీడీ యాక్ట్ పెట్టాలి

అయ్యప్ప స్వాముల ఆందోళన

ఓయూ/గండిపేట, వెలుగు: దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన బైరి నరేశ్​పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఓయూ పరిధిలోని మాణికేశ్వరి నగర్ నుంచి తార్నాక మీదుగా ఓయూ పీఎస్ వరకు అయ్యప్ప స్వాములు ర్యాలీ నిర్వహించారు. మణికొండలోని మర్రిచెట్టు వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైరి నరేశ్​కు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. నరేశ్​ పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు.

కాకా అంబేద్కర్ కాలేజీలో ట్రెడిషనల్ డే

బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో శనివారం ట్రెడిషనల్ డే నిర్వహించారు. స్టూడెంట్లు ట్రెడిషనల్ డ్రెస్సులతో హాజరై కల్చరల్ ప్రోగ్రామ్స్ తో అలరించారు. ఎంబీఏ ఫస్టియర్ స్టూడెంట్లు డ్యాన్స్, స్కిట్లతో అదరగొట్టారు. 

- వెలుగు, ముషీరాబాద్

ఎంఎడ్, ఎంపీఎడ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు

ఓయూ, వెలుగు: కామన్​పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్​ టెస్ట్​–-2022(సీపీగెట్)లో అర్హత సాధించిన ఎంఎడ్, ఎంపీఎడ్ కోర్సులకు ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించినట్లు సీపీగెట్​కన్వీనర్ ప్రొఫెసర్​పాండు రంగారెడ్డి వెల్లడించారు. శనివారం బీఎడ్, బీపీఎడ్ కోర్సుల ఫలితాలు వెలువడటంతో ఈ కోర్సుల వెబ్​ఆప్షన్ల తేదీలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు. ఈ కోర్సులకు ఇంకా ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్ ​చేసుకోనివారు ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు  చేసుకోవాలని సూచించారు. 8వ తేదీ వరకు సీట్​అలాట్ మెంట్​ చేస్తామని ఆయన చెప్పారు.