ఐపీఎల్ మ్యాచ్‌లపై ఫిక్సింగ్​ నీడలు

ఐపీఎల్ మ్యాచ్‌లపై ఫిక్సింగ్​ నీడలు
  • క్లీనర్‌‌తో సమాచారం రాబట్టిన బుకీలు
  • బీసీసీఐ ఏసీయూ చీఫ్‌‌ షబ్బీర్‌‌ హుస్సేన్‌‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ పద్నాలుగో సీజన్‌‌లో కొన్ని మ్యాచ్‌‌లను ప్రభావితం (ఫిక్సింగ్)​ చేసేందుకు బుకీలు ప్రయత్నించారు. ఇందుకోసం ఐపీఎల్‌‌ గుర్తింపు కార్డు కలిగిన ఓ క్లీనర్‌‌ను ఫిరోజ్‌‌ షా కోట్ల గ్రౌండ్‌‌లో నియమించారని బీసీసీఐ యాంటీ–కరప్షన్‌‌ యూనిట్‌‌ చీప్‌‌ షబ్బీర్‌‌ హుస్సేన్‌‌ బుధవారం వెల్లడించారు.  బాల్‌‌ టు బాల్‌‌ బెట్టింగ్‌‌  కోసం సదరు క్లీనర్‌‌తో  ‘పిచ్‌‌–సైడింగ్‌‌’ (గ్రౌండ్‌‌లో మ్యాచ్‌‌కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం) చేయించారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ మ్యాచ్‌‌లో దీన్ని గుర్తించామన్నారు. అయితే, ఈ సీజన్‌‌లో 29 మ్యాచ్‌‌ల్లో పాల్గొన్న  ప్లేయర్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌పై కరప్షన్‌‌కు సంబంధించి ఫిర్యాదు రాలేదని హుస్సేన్‌‌ స్పష్టం చేశారు.

‘కోట్లా స్టేడియంలో ఒంటరిగా ఉన్న వ్యక్తిని మా ఏసీయూ అధికారి గుర్తించారు. అతని మొబైల్​ ఫోన్లను పరిశీలిస్తుండగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. అతని దగ్గర క్లాస్‌‌4 స్టాఫ్‌‌కు ఇచ్చే ఐపీఎల్‌‌ అక్రెడిటేషన్‌‌తో పాటు పాటు రెండు ఫోన్లు ఉండడంతో అనుమానం వచ్చింది. ఢిల్లీలో ఈవెనింగ్‌‌ జరిగిన ఓ మ్యాచ్‌‌కు హాజరైన ఆ వ్యక్తి బుకీలకు సమాచారం అందించి ఉంటాడు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు తెలిపాం. తర్వాతి ఇన్సిడెంట్‌‌లో స్టేడియం దగ్గర ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌‌ చేశారు’ అని షబ్బీర్‌‌ హుస్సేన్‌‌ చెప్పారు. అయితే, తప్పించుకున్న వ్యక్తి ఏ మ్యాచ్‌‌కు హాజరయ్యాడనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, పట్టుబడ్డ మరో ఇద్దరు ఈ నెల2వ తేదీన హైదరాబాద్‌‌–రాజస్తాన్‌‌ మ్యాచ్‌‌కు ఫేక్‌‌ అక్రెడిటేషన్స్‌‌తో వచ్చారని తెలుస్తోంది.