కేసీఆర్ ఏ దేశాన్ని పొగిడితే అది మటాష్ అయిపోతుందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఐరెన్ లెగ్ శాస్త్రిలా తయారైండని విమర్శించారు. క్యాష్ ను నమ్ముకున్న ఆయన క్యారెక్టర్ కోల్పోయారని ఆరోపించారు. దేశం గురించి వ్యంగ్యంగా మాట్లాడి తన వ్యక్తిత్వాన్ని పలుచన చేసుకోవద్దని.. రాష్ట్రానికి నష్టం జరిగేలా వ్యవహరించవద్దని బూర హితవు పలికారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు గెలిచారో, నలుగురు కుటుంబ సభ్యులు గెలిచారో తేల్చేందుకు చర్చ పెడతామని, అందుకు కేసీఆర్ సిద్దమేనా అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు తొలుత 400 ఏళ్ల పాటు నిజాం పాలనలో ఆ తర్వాత ఏపీతో కలిసి ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పుడు కూడా ఆత్మహత్యలతో, బుల్లెట్ గాయాలకు ఎదురొడ్డి సాధించిన రాష్ట్రంలో మరోసారి నిర్బంధం కొనసాగుతుందని ఆరోపించారు.
ఇండియన్ ఎకానమీ బిలియన్ నుంచి ట్రిలియన్ గా మారేందుకు 60 ఏళ్లు, 2 ట్రిలియన్ ఎకానమిగా మారేందుకు 14 ఏండ్లు పడితే 3.5 ట్రిలియన్ ఎకానమీగా మారడానికి కేవలం 5 ఏండ్లు పట్టిందని బూర అన్నారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధి దిశగా పయణిస్తుందన్న ఆయన.. కొనుగోలు శక్తిలో భారత్ మూడో ర్యాంక్ లో ఉందని అన్నారు. పోరాడితే రాజకీయంగా పోరాడాలే తప్ప దేశాన్ని చిన్న చూపు చూడొద్దంటూ కేసీఆర్ కు సలహా ఇచ్చారు. వ్యాపారవేత్తలు ఎదిగితే అది రాజకీయ నాయకులకు ఎలా ఆంటగడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూతపడ్డ కంపెనీలను ఎందుకు తెరవడం లేదని.. వాటి భూములు ఎందుకు అమ్ముకుంటున్నారని బూర ప్రశ్నించారు.
