మిలియన్ మార్చ్ తరహాలో పోరాడుతం: బూర నర్సయ్య గౌడ్

మిలియన్ మార్చ్ తరహాలో పోరాడుతం: బూర నర్సయ్య గౌడ్
  • కులగణన లేకుండా స్థానిక ఎన్నికలు పెడితే ఊరుకోం: బూర నర్సయ్యగౌడ్

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలనీ బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కులగణన లేకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే సహించేది లేదని, మిలియన్ మార్చ్ తరహాలో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో హామీ ఇచ్చినట్టుగా బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కోరారు. మతాలకతీతంగా అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్ కూటమి తప్పుడు ప్రచారం చేస్తున్నదని చెప్పారు. 

ముస్లిం వర్గాలను ఓబీసీ కోటలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఓబీసీలో చేర్చడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేక కుట్రలో భాగంగానే ముస్లిం రిజర్వేషన్లను పశ్చిమబెంగాల్ సీఎం మమత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఓబీసీ కోటలోని ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసిన బెంగాల్ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు రాహుల్ టీమ్ కు చెంపపెట్టు లాంటిదని తెలిపారు. హైకోర్టు తీర్పును మమత ధిక్కరిస్తున్నదని, ఆమెను సీఎం హోదాకు అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూన్ 4 తరువాత బెంగాల్​లోనే కాదు దేశంలోనే పెను మార్పులు వస్తాయని చెప్పారు.