Joe Root: సచిన్‌కు చేరువలో రూట్.. ఆల్ టైం రికార్డ్ బ్రేక్‌కు ఎన్ని పరుగులు చేయాలంటే..?

Joe Root: సచిన్‌కు చేరువలో రూట్.. ఆల్ టైం రికార్డ్ బ్రేక్‌కు ఎన్ని పరుగులు చేయాలంటే..?

ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్టు క్రికెట్ లో దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే ఒక సెంచరీ కొట్టిన ఈ ఇంగ్లాండ్ స్టార్.. చివరి టెస్టులోనూ భారీ శతకంతో రెచ్చిపోయాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రూట్ 160 పరుగులు చేశాడు. రూట్ శతకంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులకు ఆలౌటైంది. రూట్ టెస్ట్ కెరీర్ లో ఇది 41 వ సెంచరీ. ఈ సెంచరీతో టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లలో పాంటింగ్ తో సమంగా రూట్ రెండో స్థానంలో నిలిచాడు.

అసాధారణ ఫామ్ తో దూసుకెళ్తున్న రూట్ టెస్ట్ క్రికెట్ లో సచిన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. అదేదో చిన్న రికార్డ్ అనుకుంటే పొరపాటే. టెస్టుల్లో సచిన్ సాధించిన అత్యధిక పరుగుల ఆల్ టైం రికార్డ్. ప్రస్తుతం రూట్ టెస్ట్ క్రికెట్ లో 13937 పరుగులు చేశాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య పరుగుల అంతరాయం 2000 పరుగుల లోపే ఉంది. టెస్టుల్లో రూట్ కు సచిన్ కు మధ్య కేవలం 1984 పరుగుల తేడా మాత్రమే ఉంది. 1985 పరుగులు చేస్తే రూట్.. టెస్టుల్లో సచిన్ ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. 

Also Read : హాకీ ఇండియా లీగ్ బెంగాల్ టైగర్స్ శుభారంభం

35 ఏళ్ళ రూట్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో రెగ్యులర్ గా కొనసాగుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ స్టార్ క్రికెటర్ మరో 3నుంచి 4 ఏళ్ళ పాటు టెస్ట్ క్రికెట్ ఆడుకోవచ్చు. ఇంగ్లాండ్ టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్ రూట్ బ్రేక్ చేయడం కష్టం కాకపోవచ్చు. మరో 11 సెంచరీలు చేస్తే సచిన్ సెంచరీల సంఖ్యను కూడా రూట్ దాటేస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో రూట్ 9 ఇన్నింగ్స్ ల్లో 393 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ లేని లోటు తీర్చుకున్న రూట్..సిడ్నీలో సెంచరీ బాదేసి ఈ సిరీస్ లో రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.