Sudha Chandran: పూనకంతో ఊగిపోయిన సుధా చంద్రన్.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Sudha Chandran: పూనకంతో ఊగిపోయిన సుధా చంద్రన్.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ప్రముఖ సీనియర్ నటి , క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ మరో సారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఆమె నటన కోసమో.. డ్యాన్స్ కోసమో కాదు. ఇటీవల ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  భజన కార్యక్రమంలో  పాల్గొన్న ఆమె పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అసలేం జరిగింది?

ఇటీవల జరిగిన ఒక దేవీ జాగరణ్ కార్యక్రమంలో సుధా చంద్రన్ పాల్గొన్నారు. ఎరుపు , తెలుపు రంగు చీర కట్టుకుని, నుదుటిపై ‘జై మాతా దీ’ అని రాసి ఉన్న బ్యాండ్ ధరించి ఆమె భజనలో నిమగ్నమయ్యారు. పాటల హోరు పెరుగుతున్న కొద్దీ, ఆమెలో భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఒకానొక దశలో ఆమె తనను తాను మర్చిపోయి, ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినట్లుగా కనిపించారు. నియంత్రణ కోల్పోయి ఆమె పూనకంతో ఊగిపోయింది. అటు ఇటు తిరుగుతున్న ఆమెను పట్టుకోవడానికి అక్కడి వారు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమెను ఆపడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి చేతిని కోపంతో కొరికేందుకు ప్రయత్నించింది. నటి జస్వీర్ కౌర్ మరికొందరు ఆమెను శాంతింపజేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

నెటిజన్ల రియాక్షన్స్..

ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ఆమె భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి శక్తి ఆమెలోకి ప్రవేశించడం వల్లే అలా ప్రవర్తించారు. దీనిని ఎగతాళి చేయకూడదు అని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు ఆమె ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉన్నారా? లేదా అనారోగ్య సమస్య ఏమైనా ఉందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి. ఒక ప్రమాదంలో కాలు కోల్పోయినా కృత్రిమ కాలుతో డ్యాన్స్ చేసి గెలిచిన ధీశాలి. అలాంటి వ్యక్తిని విమర్శించే ముందు ఆమె నేపథ్యాన్ని గౌరవించాలి అని రాసుకొచ్చారు.

Also Read :  సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, ప్రొడక్షన్ కంట్రోలర్ కన్నుమూత

పట్టుదలకు మారుపేరు సుధా చంద్రన్

సుధా చంద్రన్ కేవలం నటి మాత్రమే కాదు, పట్టుదలకు మారుపేరు. చిన్నతనంలోనే ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె తన కాలును కోల్పోయారు. కానీ డ్యాన్స్ మీద ఉన్న మక్కువతో జైపూర్ ఫుట్ సాయంతో మళ్ళీ చిందేశారు. ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన 'మయూరి' సినిమా ఘనవిజయం సాధించింది. ఆమె సినీ జీవితం కూడా ఈ మూవీతోనే ప్రారంభమైంది. తన తొలిచిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో 'నాగిన్' సీరియల్ లో యామినీ రహేజా పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో కూడా అనేక సీరియల్స్ ,  సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.

ఈ వైరల్ వీడియోపై సుధా చంద్రన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇది కేవలం భక్తి పారవశ్యమా లేక మరేదైనా కారణమా అన్నది పక్కన పెడితే, ఆమె పట్ల సానుభూతితో వ్యవహరించాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా, తన అద్భుత పోరాట పటిమతో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన సుధా చంద్రన్ ఇలాంటి స్థితిలో కనిపించడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది.